యూకే వైద్యులను నోరెళ్లబెట్టేలా చేసిన 98 ఏళ్ల భారత బామ్మ!

  • కోవిడ్ బారినపడి నాలుగు రోజుల్లోనే కోలుకున్న వృద్ధురాలు
  • ఆమె కోలుకున్న తీరుచూసి ఆశ్చర్యపోయిన వైద్యులు
  • చీకట్లోనూ ఆశాదీపమన్న స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్
భారత సంతతికి చెందిన 98 ఏళ్ల బామ్మ యూకే వైద్యులను నోరెళ్లబెట్టేలా చేసింది. కోవిడ్-19 బారినపడి నాలుగు రోజుల్లోనే కోలుకున్న ఆమె తాజాగా స్కాట్లాండ్‌లోని తన ఇంటికి చేరుకుంది. ఆ బామ్మ పేరు డఫ్నే షా. కేరళలోని కొచ్చిలో జన్మించింది. ఈ జులైతో 99వ ఏట అడుగిడబోతోంది.

గత గురువారం ఆమెలో కోవిడ్ లక్షణాలు కనిపించాయి. శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగింది. విపరీతమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే ఆమెను డుండీలోని నైన్‌వెల్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. అయితే, విచిత్రంగా ఆమె చాలా వేగంగా కోలుకోవడాన్ని చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. సోమవారానికే అంటే నాలుగు రోజుల్లోనే ఆమె వైరస్‌ను ఓడించి ఇంటికి చేరుకుంది.

తన బాగోగులను ఇప్పుడు తన కుమారుడు చూసుకుంటున్నాడని డఫ్నే పేర్కొన్నారు. తానిప్పుడు బాగానే ఉన్నానని, అయితే, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పలేనన్నారు. జులైలో బర్త్‌డే వేడుకలు జరుపుకోబోతున్నానన్న ఆలోచన బాగుందని వివరించారు. మరోపక్క, స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టర్జన్ నిర్వహించిన కరోనా వైరస్ అప్‌డేట్ కాన్ఫరెన్స్‌లో డఫ్నే ప్రస్తావన తీసుకొచ్చారు. ఆమె కోలుకోవడం చాలా ఉత్తేజాన్ని ఇచ్చిందని, ఇదో మంచి శుభవార్త అని పేర్కొన్నారు. చిమ్మ చీకట్లోనూ ఆశాదీపం కనిపిస్తుందనడానికి డఫ్నే ఓ ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు.


More Telugu News