ఎస్ఈసీని మార్చడం అనైతికం... ఏ నిబంధన అయినా పదవీకాలం ముగిశాకే అమలు చేయాలి: చంద్రబాబు

  • ఎస్ఈసీ పదవీకాలం కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన ఏపీ సర్కారు
  • నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు
  • గవర్నర్ కు లేఖ రాసిన చంద్రబాబు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఏపీ సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్, ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఈ-మెయిల్ ద్వారా లేఖ రాశారు.

రాజ్యాంగంలో 243 (కె) నిబంధన ప్రకారం 2016లో ఎస్ఈసీని నియమించారని, ఐదేళ్ల కాలవ్యవధికి నియమితులైన ఆయనను ఇప్పుడు ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తొలగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మధ్యలో నిలిచిపోయిందని, ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషనర్ ను దొడ్డిదారిన మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అర్ధాంతరంగా ఎస్ఈసీని మార్చడం అనైతికం, చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. ఏ నిబంధన అయినా పదవీకాలం ముగిశాకే అమలు చేయాలని, తాజా ఆర్డినెన్స్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News