’కరోనా’ ఎఫెక్ట్ ..దేశ వ్యాప్తంగా ‘సురక్ష స్టోర్స్’ ఏర్పాటు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం?

  • దేశ వ్యాప్తంగా 20 లక్షల సురక్ష స్టోర్స్  
  • వచ్చే 45 రోజుల్లోగా ప్రజలకు అందుబాటులోకి ?
  • సురక్ష స్టోర్స్ ద్వారా నిత్యావసరాలు, వినియోగ వస్తువులు 
‘కరోనా’ కట్టడి నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు యావత్తు దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచనతో ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా తగు ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు నిత్యావసరాలను అందించే నిమిత్తం దేశ వ్యాప్తంగా ‘సురక్ష స్టోర్స్’ ను ఏర్పాటు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.

దేశ వ్యాప్తంగా 20 లక్షల సురక్ష స్టోర్స్ ను ఏర్పాటు చేసే నిమిత్తం ఇప్పటికే ఓ దఫా చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ‘సురక్ష స్టోర్స్’ ద్వారా నిత్యావసరాలు, వినియోగదారులు ఉపయోగించే వస్తువులు, దుస్తులు, సెలూన్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తోంది. స్థానికంగా ఉండే కిరాణా దుకాణాలను శానిటైజ్డ్ అవుట్ లెట్స్ గా మార్చి వాటికి ‘సురక్ష స్టోర్స్’ గా మార్చాలన్నది ప్రభుత్వ యోచనగా  తెలుస్తోంది. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు ప్రైవేట్ ఫర్మ్స్ తో ప్రభుత్వం ముందు కెళ్తుందని, కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు తయారీ యూనిట్ల నుంచి రిటైల్ అవుట్ లెట్ల వరకూ సప్లయ్ చైన్ మొత్తం తగు ప్రమాణాలు పాటించేలా చూస్తుందని తెలుస్తోంది. వచ్చే 45 రోజుల్లో ‘సురక్ష స్టోర్స్’ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోందని సంబంధిత వర్గాల సమాచారం.

'సురక్ష స్టోర్' కావడానికి, రిటైల్ దుకాణం నిర్దేశించిన ఆరోగ్య మరియు భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి.  దుకాణం వెలుపల, బిల్లింగ్ కౌంటర్ల వద్ద 1.5 మీటర్ల సామాజిక దూరం, వినియోగదారులు దుకాణాలలోకి ప్రవేశించే ముందు సానిటైజర్ లేదా హ్యాండ్‌వాష్ సదుపాయం, మొత్తం  సిబ్బందికి మాస్క్ లు, రోజుకు రెండుసార్లు  శానిటైజేషన్ చేయడం లాంటివి పాటించవలసిన అవసరం ఉంటుంది.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్)ను అనుసరించి  కోవిడ్-19 ప్రోటోకాల్స్ పై అవగాహన కల్పించేందుకు సురక్ష స్టోర్స్, సురక్ష సర్కిల్ కు ఆన్ లైన్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఇస్తారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది  కాగా, ‘సురక్ష స్టోర్స్’ విషయమై  వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి పవన్ కుమార్ అగర్వాల్ ను మీడియా ప్రశ్నించగా ఇందుకు సంబంధించిన వివరాలను చెప్పేందుకు ఆయన నిరాకరించారు.


More Telugu News