200 మంది నీలోఫర్‌ ఆసుపత్రి సిబ్బందికి క్వారంటైన్‌ : ఆదేశాలు జారీచేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌

  • ఆసుపత్రిలో చికిత్స పొందిన 45 రోజు చిన్నారికి కరోనా
  • ఈనెల 15, 16, 17 తేదీల్లో బాలుడికి చికిత్స
  • ఆ రోజుల్లో పనిచేసిన అందరికీ క్వారంటైన్‌
హైదరాబాద్‌ నగరంలోని నీలోఫర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న 200 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన 45 రోజుల బాలుడికి కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ కావడంతో ఈనెల 15, 16, 17 తేదీల్లో ఆసుపత్రిలో విధులు నిర్వహించిన ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ఫ్రొఫెసర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.

వివరాల్లోకి వెళితే...నారాయణపేట్‌ జిల్లా అభంగాపూర్‌కు చెందిన మహిళ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించింది. డిశ్చార్జి అయ్యాక నలభై ఐదు రోజుల వయసున్న చిన్నారికి జ్వరం రావడంతో అతని తండ్రి స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారిని తీసుకువెళ్లారు.

అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ బాలుడిని నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారి నుంచి సేకరించి శాంపిల్స్‌తో కరోనా పాజిటివ్‌ అని తేలడంతో సూపరింటెండెంట్‌ ఈ ఆదేశాలు జారీచేశారు. అలాగే చిన్నారి కుటుంబ సభ్యులు ఆరుగురిని కూడా క్వారంటైన్‌కు తరలించారు.


More Telugu News