డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బందికి హోటళ్లలో బస... యాజమాన్యాలతో మాట్లాడుతున్న తెలంగాణ సర్కారు!

  • కరోనా చికిత్సలో పాల్గొంటున్న వైద్యులు, ఇతర సిబ్బంది
  • వారి కుటుంబసభ్యులకు రిస్క్ ఉంటుందని భావిస్తున్న సర్కారు
  • హోటళ్ల ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు
తెలంగాణలో కరోనా రోగుల చికిత్సలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది నిమగ్నులై ఉన్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తులతో వైద్య సిబ్బంది సన్నిహితంగా మెలిగే నేపథ్యంలో వారి ద్వారా వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. అందుకే డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి ప్రత్యేకంగా హోటళ్లలో బస ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో నీతూ కుమారి ప్రసాద్, రఘునందన్ రావు, లోకేశ్ కుమార్ ఉన్నారు.

ఎన్ని హోటల్ గదులు అవసరం అవుతాయి? అద్దెలు, ఇతర ఖర్చులు ఎంత? వాటిలో ఎలాంటి సౌకర్యాలు ఉండాలి? అనే అంశాలను సదరు కమిటీ పరిశీలించనుంది. నిత్యం వందల సంఖ్యలో రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులను ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తే వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే కొన్ని హోటళ్ల జాబితా రూపొందించిన కమిటీ, ఆయా హోటళ్ల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సదరు అధికారి వెల్లడించారు.


More Telugu News