కిమ్ ఆరోగ్య పరిస్థితిపై పెదవి విప్పని ఉత్తర కొరియా

  • కిమ్ ఆరోగ్యంపై ఆ దేశ మీడియాలో కానరాని వార్తలు
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ట్రంప్
  • ఆయన తదనంతరం గద్దెనెక్కేదెవరన్న దానిపై ఊహాగానాలు
ఉత్తరకొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా ఊహాగానాలు వెల్లువెత్తుతుంటే ఆ దేశం మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడం గమనార్హం. ఆయన ఆరోగ్యంపై అక్కడి మీడియాలో వార్తలు కనిపించడం లేదు. అయితే, వివిధ రంగాల్లో కిమ్ సాధించిన విజయాలకు సంబంధించిన వార్తలను మాత్రం ఇస్తుండడం అనుమానాలకు తావిస్తోంది.

కిమ్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిజమో, కావో తనకు తెలియదని.. అయితే, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 15 ఉత్తర కొరియాకు ఎంతో ముఖ్యమైన రోజు. ఆ దేశ వ్యవస్థాపకుడు, కిమ్ తాత అయిన ఇల్ సంగ్ జయంతి ఆ రోజు.

2011లో కిమ్ అధికారం చేపట్టినప్పటి నుంచీ ఈ వేడుకలకు ఆయన ఎప్పుడూ దూరంగా లేరు. ఈసారి మాత్రం హాజరు కాకపోవడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. 36 ఏళ్ల కిమ్‌ గుండెకు శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందన్న కథనాలు మొదలయ్యాయి. ఆయన చివరిసారి ఏప్రిల్ 12న బయటి ప్రపంచానికి కనిపించారు.

ఊబకాయం, చైన్ స్మోకింగ్, పని ఒత్తిడితో సతమతమై కిమ్ అనారోగ్యం పాలయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు రాజధాని ప్యాంగ్యాంగ్‌ సమీపంలోని ఓ రిసార్టులో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ కిమ్ ఆరోగ్యం నిజంగానే విషమంగా ఉంటే ఆ తర్వాత గద్దెనెక్కేదెవరన్న ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి.


More Telugu News