ఫేస్ బుక్ లో తిరుగులేని ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ

  • 4.5 కోట్ల లైకులతో వరల్డ్ నెంబర్ వన్ గా మోదీ
  • అత్యధిక స్పందనల విషయంలో ట్రంప్ కు అగ్రస్థానం
  • బీసీడబ్ల్యూ అధ్యయనంలో ఆసక్తికర వివరాలు వెల్లడి
భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా వ్యవహరిస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో ఆయనకున్న పాప్యులారిటీ అంతాఇంతా కాదు. కోట్ల సంఖ్యలో ఫాలోవర్లతో ఇతర దేశాల నేతలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. తాజాగా బీసీడబ్ల్యూ (బర్సన్ కాన్ అండ్ వోల్ఫ్) అనే గ్లోబల్ కమ్యూనికేషన్స్ సంస్థ అధ్యయనం చేపట్టగా ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. 4.5 కోట్ల మంది ఫాలోవర్లతో ఫేస్ బుక్ లో భారత ప్రధాని మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రపంచనేతగా కొనసాగుతున్నారని బీసీడబ్ల్యూ పేర్కొంది.

మోదీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2.7 కోట్ల మంది ఫేస్ బుక్ ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. జోర్డాన్ రాణి రానియా అల్ అబ్దుల్లాకు మూడోస్థానం లభించింది. ఆమె ఫేస్ బుక్ పేజీని ఇష్టపడ్డవారి సంఖ్య 1.6 కోట్లు. అయితే, అత్యధిక స్పందనల విషయంలో మాత్రం ట్రంప్ అగ్రస్థానంలో నిలిచారు. ట్రంప్ ప్రసంగాలు, పోస్టులకు 30.9 కోట్ల కామెంట్లు, లైకులు లభించగా, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో 20.5 కోట్ల కామెంట్లు, లైకులతో ద్వితీయస్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో మోదీకి మూడో స్థానం దక్కింది. ఫేస్ బుక్ లో ఆయన పోస్టులకు వచ్చిన స్పందనల సంఖ్య 8.4 కోట్లు అని బీసీడబ్ల్యూ తెలిపింది.


More Telugu News