పల్స్ ఆక్సీమీటర్.. కరోనాను ఈ చిన్న పరికరంతో కొంచెం ముందుగా గుర్తించవచ్చు!

  • న్యూమోనియాకు కారణమవుతున్న కరోనా
  • ఆక్సిజన్ స్థాయి పడిపోయి మరణం సంభవిస్తున్న వైనం
  • పల్స్ ఆక్సీమీటర్ సాయంతో ఆక్సిజన్ లెవెల్ గుర్తింపు
న్యూయార్క్ లో ఉన్న బెల్లెవ్యూ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో సేవలు అందించిన డాక్టర్ రిచర్డ్ లెవిటన్ కరోనా మహమ్మారి జిత్తులమారి తనాన్ని వివరించారు. ఈ వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత నిశ్శబ్దంగా న్యూమోనియా కలిగిస్తుందని, దీనివలన శరీరంలో  ఆక్సిజన్ స్థాయి పడిపోయి మరణాలు సంభవిస్తాయని అన్నారు.
కొంతమంది  రోగులలో కోవిద్ న్యూమోనియా లక్షణాలు బయటపడటానికి వారం రోజులకు  పైగానే పట్టవచ్చని.. ఈలోపు ఊపిరితిత్తులకు జరగవలసిన  నష్టం జరిగి పోతుందని తెలిపారు. అదే ఈ సైలెంట్ న్యూమోనియాను  మనం ముందుగా గుర్తించగలిగితే రోగులను వెంటిలేటర్ పై ఉంచాల్సిన ఆవసరం తప్పించి, వారి ప్రాణాలను కాపాడవచ్చు అని చెప్పారు.

శరీరంలో ఆక్సిజన్ తగ్గిపోవడాన్ని హైపోక్సియా అంటారని, దీన్ని పల్స్ ఆక్సీమీటర్ సాయంతో పసిగట్టవచ్చని పేర్కొన్నారు. పల్స్ ఆక్సీమీటర్ సాయంతో ఆక్సిజన్ స్థాయులను బట్టి కరోనా న్యూమోనియాను ముందుగానే  గుర్తించవచ్చని వివరించారు. సాధారణంగా మనిషి  రక్తంలో ఆక్సిజన్ స్థాయి 94 నుండి 100 శాతం వరకు
ఉంటుంది. అదే కరోనా రోగులలో 50 శాతం వరకు కూడా పడిపోవడాన్ని గమనించామని తెలిపారు.

పల్స్ ఆక్సీమీటర్ వినియోగం ఎంతో సులభం. ఓ థర్మామీటర్ తరహాలోనే ఇది కూడా సులువుగా ఉపయోగించే వీలుంది. ఓ వేలి కొసన ఈ మీటర్ ఉంచి ఒక్క బటన్ నొక్కితే చాలు. కొన్ని సెకన్ల తర్వాత డిస్ ప్లేలో పల్స్ రేట్ తో పాటు ఆక్సిజన్ శాచురేషన్ రేటును ప్రదర్శిస్తుంది. ఈ మీటర్ శరీరంలో ఆక్సిజన్ సంబంధిత సమస్యలు గుర్తించడమే కాకుండా, హృదయ స్పందనలను కూడా వెల్లడిస్తుందని డాక్టర్ లెవిటన్ వివరించారు.

ఇద్దరు వైద్యుల ప్రాణాలను కూడా ఈ పల్స్ ఆక్సీమీటర్ సాయంతో కాపాడగలిగామని, వారిద్దరి ఆక్సీజన్ లెవెల్స్ పడిపోయిన విషయాన్ని మీటర్ సాయంతో తెలుసుకోగలగడంతో వారు హుటాహుటీన చికిత్స తీసుకుని క్షేమంగా బయటపడగలిగారని వివరించారు. వారిలో ఒకరికి సుదీర్ఘకాలం చికిత్స అవసరమైందని తెలిపారు.

ఇక, ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు అందించిన చికిత్సలోనూ హైపోక్సియాను ముందే గుర్తించడం ద్వారా చికిత్స తేలికైందని అన్నారు. కాగా, ఈ పల్స్ ఆక్సీమీటర్ ఆన్ లైన్ లోనూ అందుబాటులో ఉంటాయి. ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో దీని ఖరీదు రూ.2000 పైచిలుకు ఉంది.

కానీ, హైపోక్సియా ఉందంటే కరోనా ఉన్నట్లుకాదు. దీనికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. కరోనా వ్యాధి నిర్దారణకు ఇది అంతిమ ఉపశమనం కాక పోయినా సైలెంట్ న్యూమోనియాను ముందుగానే గుర్తించడం వలన కొంతవరకు ప్రాణాపాయాన్ని తప్పించడంలో ఇది ఉపయోగ పడుతుందని తెలిపారు.


More Telugu News