ఒక దొంగ దెబ్బకు... క్వారంటైన్ కు జడ్జి, కోర్టు సిబ్బంది, పోలీసులు!

  • సిగరెట్ షాపులో దొంగతనానికి యత్నించిన దొంగ
  • కరోనా టెస్టులో పాజిటివ్ వచ్చిన వైనం
  • దీంతో మొత్తం 22 మంది క్వారంటైన్ కు తరలింపు
ఒక దొంగ దెబ్బకు ఏకంగా 22 మందికి క్వారంటైన్ లో గడపాల్సిన పరిస్థితి దాపురించింది. ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ముంబైలోని గోరేగావ్ కు చెందిన ఓ యువకుడు సిగరెట్ షాపులో దొంగతనానికి యత్నిస్తుండగా... దాన్ని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అతనిపై పలు కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

అనంతరం కోర్టులో అతన్ని ప్రవేశపెట్టారు. విచారణ కోసం అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసు విచారణ ముగిసిన తర్వాత తొలుత అతన్ని థానే సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, అక్కడ ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో... రాయ్ గడ్ లోని తలోజా సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. అయితే, నిందితుడుకి కరోనా పరీక్షలు నిర్వహిస్తేనే జైల్లోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. .

దీంతో, నిందితుడికి నగరంలోని జేజే ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో అధికారులు షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత కేసును విచారించిన జడ్జి, కోర్టు సిబ్బంది, విచారణలో భాగంగా అతనితో గడిపిన పోలీసులను (అందరు కలిపి మొత్తం 22 మంది) క్వారంటైన్ కు తరలించారు.


More Telugu News