14 మంది సమక్షంలో కుమార్తె వివాహం కానిచ్చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే

  • ఈ నెల 26న వివాహం
  • దర్యాప్తు జరిపించాలన్న డీఎంకే
  • ఆలయం బయటే వివాహం జరిగిందన్న ఎమ్మెల్యే చిత్ర
ఎమ్మెల్యే కుమార్తె వివాహమంటే ఎంత ఘనంగా జరగాలి?.. ఎంత ఆర్భాటం ఉండాలి? కానీ అవేవీ లేకుండానే తమిళనాడులోని అన్నాడీఎంకే ఎమ్మెల్యే తన కుమార్తె వివాహాన్ని జరిపించారు.

 సేలం జిల్లా ఏర్కాడు ఎమ్మెల్యే చిత్ర-గుణశేఖర్ దంపతుల కుమార్తె సింధు (21), ధర్మపురి జిల్లా పాపిరెట్టిపట్టికి చెందిన విద్యుత్ బోర్డు ఇంజినీర్ ప్రశాంత్‌ల వివాహం ఇటీవలే నిశ్చయమైంది. ఈ నెల 26న ముఖ్యమంత్రి పళనిస్వామి నియోజకవర్గమైన వాళప్పాడిలోని తాంతోంద్రీశ్వర్ ఆలయంలో వివాహం జరుగుతుందని, సీఎం, డిప్యూటీ సీఎంలు ఈ వివాహానికి హాజరవుతున్నట్టు శుభలేఖలో పేర్కొన్నారు.

అయితే, లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో అనుకున్న ముహూర్తానికే ఆలయంలో వివాహం జరిపించినప్పటికీ అత్యంత సాదాసీదాగా జరిగింది. పురోహితుడు, ఫొటోగ్రాఫర్ సహా 14 మంది మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.

ఇదిలావుంచితే, ఈ వివాహంపై అప్పుడే రాజకీయ రగడ మొదలైంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఆలయంలో వివాహం జరిపించారంటూ డీఎంకే ఆరోపించింది. ఈ వివాహానికి పెద్ద ఎత్తున హాజరయ్యారని పేర్కొంది. దీనిపై విచారణ జరిపించాలని డీఎంకే డిమాండ్ చేసింది. అయితే, డీఎంకే ఆరోపణలను ఎమ్మెల్యే చిత్ర కొట్టిపడేశారు. వివాహం ఆలయంలో జరగలేదని, ఆలయం బయట జరిగిందని వివరణ ఇచ్చారు.


More Telugu News