చరిత్రలో తొలిసారి... నెల రోజుల వ్యవధిలో దేశీయంగా ఒక్క కారునూ విక్రయించని మారుతి సుజుకి!

  • మార్చిలో 47 శాతం తగ్గిన కార్ల అమ్మకాలు
  • ఏప్రిల్ లో ఒక్క యూనిట్ నూ విక్రయించలేదు
  • 632 వాహనాలను మాత్రం ఎగుమతి చేశాం
  • ప్రకటన విడుదల చేసిన మారుతి సుజుకి
లాక్ డౌన్ కష్టాలు ఆర్థిక వ్యవస్థను ఎంతగా అతలాకుతలం చేస్తాయో చెప్పడానికి మారుతి సుజుకి ఉదాహరణగా నిలిచింది. ప్రతి నెలా వేల సంఖ్యలో కార్లను విక్రయించే ఈ సంస్థ చరిత్రలో తొలిసారిగా గడచిన ఏప్రిల్ లో 'జీరో సేల్స్' నమోదయ్యాయి.

ఒక్క మారుతి సుజుకి మాత్రమే కాదు, మిగతా వాహన సంస్థలదీ ఇదే పరిస్థితి. తాము ఏప్రిల్ లో ఒక్క వాహనాన్ని కూడా విక్రయించలేదని, ఇదే సమయంలో ముంద్రా పోర్టు నుంచి 632 వాహనాలను మాత్రం ఎగుమతి చేశామని సంస్థ అధికారికంగా వెల్లడించింది. అది కూడా పాక్షికంగా ప్రొడక్షన్ ను ప్రారంభించేందుకు కేంద్రం అనుమతించిన తరువాత జరిగిందేనని తెలిపింది.

ప్రస్తుతం మనేసర్ లోని ప్లాంటులో జిల్లా అధికారుల అనుమతి పొంది, ఒక షిఫ్ట్ లో కార్ల తయారీని ప్రారంభించామని, మొత్తం 4,696 మంది పని చేస్తుండగా, రోజుకు 50 కార్లు తయారవుతున్నాయని తెలిపింది. మార్చి 22 నుంచి ఉత్పత్తి నిలిచిపోయిందని, మార్చిలోనే 47 శాతం మేరకు అమ్మకాల కోత నమోదైందని పేర్కొంది. 2019 మార్చిలో 1,58,076 వాహనాలను విక్రయించిన సంస్థ ఈ సంవత్సరం మార్చిలో 83,792 యూనిట్లను విక్రయించినట్టు ప్రకటించింది.


More Telugu News