నోరు జారిన ఎలాన్ మస్క్... భారీ నష్టంతో పాటు టెస్లా సీఈఓ పదవికి చేటు!

  • టెస్లా ఈక్విటీ విలువ ఎక్కువగా ఉందని వ్యాఖ్య
  • సంస్థకు 14 బిలియన్ డాలర్ల నష్టం
  • ఎలాన్ మస్క్ పై చర్యలు తీసుకోవాలని ఇన్వెస్టర్ల డిమాండ్
ఎలాన్ మస్క్... ఎలక్ట్రిక్ వాహనాల పేరు చెబితే గుర్తుకు వచ్చే టెస్లా సంస్థకు సీఈఓ. ప్రపంచ కుబేరుల్లోనూ ఒకరు. అటువంటిది ఆయన, కేవలం 7 ఆంగ్ల పదాలను వాడుతూ పెట్టిన ట్వీట్, 3 బిలియన్ డాలర్ల సంపదను హరించడంతో పాటు, ఆయన పదవికి చేటు తెచ్చి పెట్టింది. ఈ నెల 1వ తేదీన, ఆయన తన ట్విట్టర్ ఖాతాలో "నా అభిప్రాయం ప్రకారం, టెస్లా కంపెనీ ఈక్విటీ ధర అధికంగా ఉంది" (Tesla stock price is too high imo (In My Openion) అని వ్యాఖ్యానించడం సంస్థను తీవ్ర నష్టానికి గురి చేసింది.

ఎలాన్ మస్క్ చేసిన ఈ వ్యాఖ్యతో, సంస్థ ఈక్విటీ ఘోరంగా పతనమైంది. ఈ ట్వీట్ ను పెట్టిన సమయానికి 760.23 డాలర్ల వద్ద ఉన్న కంపెనీ ఈక్విటీ విలువ, ఆపై రెండున్నర గంటల వ్యవధిలో 11.08 శాతం పతనమై 695.24 డాలర్లకు దిగజారింది. ఆపై కొంత తేరుకుని 10.39 శాతం నష్టాన్ని మిగుల్చుకుని 717.64 డాలర్ల వద్ద కొనసాగింది.

ఇక టెస్లా చేసిన వ్యాఖ్యలతో తాము నష్టపోయామని ఇన్వెస్టర్ వర్గాలు గగ్గోలు పెట్టాయి. ఆయన ట్వీట్ ను తీవ్రంగా పరిగణించాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వచ్చింది. ఈ ఒక్క ట్వీట్ ఫలితంగా టెస్లా సంస్థ 14 బిలియన్ డాలర్లు నష్టపోయింది.

కాగా, ఎలాన్ మస్క్ ఇటువంటి ఆందోళనకరమైన ట్వీట్లు పెట్టడం ఇదే మొదటి సారి కాదు. 2018లో ఆయన పెట్టిన ఓ ట్వీట్ ఆయన్ను సంస్థ చైర్మన్ పదవి నుంచి దిగిపోయేలా చేసింది. తమ సంస్థపై వచ్చిన మోసపూరిత ఆరోపణలపై ఎస్ఈసీతో సెటిల్ మెంట్ చేసుకోనున్నామని ఆయన వ్యాఖ్యానించడంపై ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి. ఫలితంగా టెస్లా బోర్డు చైర్మన్ పదవిని వదులుకున్న ఆయన, అప్పటి నుంచి సీఈఓగా మాత్రమే కొనసాగుతున్నారు.

తాజా ట్వీట్ తో ఆయన పెట్టుబడిదారులను తప్పుదారి పట్టిస్తున్నారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ట్వీట్ కు ముందు 141 బిలియన్ డాలర్లుగా ఉన్న సంస్థ ఈక్విటీ ఏకంగా 127 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కాగా, ఏదైనా సంస్థలో పెద్ద పొజిషన్ లో ఉన్నవారు, సెక్యూరిటీస్ విషయమై ట్వీట్లు చేసే ముందు ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ, మస్క్ మాత్రం ఎవరినీ సంప్రదించకుండానే, ఈ తరహా ట్వీట్లు చేయడంతో ఆయన సీఈఓ పదవి ఊడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


More Telugu News