సెప్టెంబరు 1 నుంచి నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ: సీఎం జగన్

  • పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం సమీక్ష
  • మొబైల్ వాహనాల ద్వారా బియ్యం డోర్ డెలివరీ
  • బియ్యం నాణ్యతలో రాజీపడేదిలేదని సీఎం స్పష్టీకరణ
 ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబరు 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలన్నది వాటిలో ప్రధానమైన నిర్ణయం. మొబైల్ వాహనాల ద్వారా లబ్దిదారుల ఇంటివద్దకే డోర్ డెలివరీ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

సెప్టెంబరు 1న రాష్ట్రవ్యాప్తంగా బియ్యం డోర్ డెలివరీ పథకాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. బియ్యంలో నాణ్యత, పంపిణీలో పారదర్శకతే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవినీతికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పథకం అమలు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్ కు పలు అంశాలు నివేదించారు. గ్రామసచివాలయాల్లో 13,370 మొబైల్ యూనిట్లు ఉన్నాయని, మొబైల్ యూనిట్ లోనే ఎలక్ట్రానిక్ కాటా ఉంటుందని తెలిపారు. లబ్ధిదారుల ముందే బస్తా సీల్ తీసి కోటా బియ్యం అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా, బియ్యం కోసం లబ్ధిదారులకు నాణ్యమైన సంచులు కూడా అందిస్తామని తెలిపారు. ప్రతి నెల 2.3 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ చేయనున్నట్టు అధికారులు వివరించారు.


More Telugu News