12 ఏళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయిన వ్యక్తిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చిన టిక్‌టాక్!

  • నాగర్‌కర్నూల్‌లో ఘటన
  • మతిస్థిమితం లేక 12 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన చంద్రు
  • నారాయణ పేట జిల్లాలో ఉంటోన్న వ్యక్తి
  • ఒకరు టిక్‌టాక్‌లో వీడియో పోస్ట్ చేయడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు‌
రాత్లావత్‌ చంద్రునాయక్‌(46)  అనే వ్యక్తి 12 ఏళ్ల క్రితం నాగర్‌కర్నూల్ జిల్లాలోని  బిజినేపల్లి మండలం పెద్ద తండాలో ఉండేవాడు. మతి స్థిమితం లేక ఇంట్లోంచి వెళ్లిపోయి మళ్లీ తిరిగిరాలేదు. 12 ఏళ్లుగా అతడికోసం భార్య, పిల్లలు వెతుకుతున్నారు. అయినప్పటికీ అతడు కనపడలేదు.

అయితే, చివరకు టిక్‌టాక్ వీడియో అతడిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చింది. అవును, ఇటీవల అతడి టిక్‌టాక్‌ వీడియోను చూసిన పెద్దతండాలోని ఓ వ్యక్తి చంద్రునాయక్ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పడంతో అతడు నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామంలో ఉన్నాడని వారికి తెలిసింది. అక్కడికి వెళ్లి చంద్రునాయక్‌ను సొంత ఇంటికి తీసుకొచ్చారు.

అతడు ఈ 12 ఏళ్లుగా గుడిగండ్ల గ్రామంలో చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని కుటుంబ సభ్యులకు తెలిసింది. కొందరు అతడితో పనులు చేయించుకుని అతడికి భోజనం పెట్టేవారని, గడ్డం పెరిగినప్పుడు గ్రామస్థులే క్షవరం చేయించే వారని చంద్రునాయక్‌ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. రాత్రి సమయాల్లో గుడి, బడి, చెట్లకింద పడుకునే వాడని ఆ గ్రామస్థులు అతడి కుటుంబానికి తెలిపారు.

అలా తెలిసింది..

ఇటీవల ఓ వ్యక్తి... చంద్రునాయక్‌ను‌ వివరాలు అడుగుతూ వీడియో రికార్డ్‌ చేశాడు. దాన్ని టిక్‌టాక్‌లో పోస్టు చేసి, అతడికి తెలిసిన వారు ఎవరైనా సంప్రదించాలని కోరడంతో ఆ వీడియో ఆ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లింది. దీంతో వారు పోలీసుల వద్దకు వెళ్లారు. అనంతరం  పోలీసుల సాయంతో చంద్రునాయక్‌ వద్దకు కుమారుడు శ్రీను, కూతురు లక్ష్మి వెళ్లి అతడిని ఇంటికి తీసుకెళ్లారు.


More Telugu News