రెండు నెలల విరామానికి తెర.. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలకు అనుమతి!

  • అన్ని రకాల వాహనాలకు గ్రీన్ సిగ్నల్
  • సాయంత్రం ఏడు తర్వాత కార్లకు నో
  • టోల్ ప్లాజాల వద్ద డిజిటల్ పేమెంట్‌కే మొగ్గు చూపాలని సూచన
కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత దానికి అడ్డుకట్ట వేసేందుకు దాదాపు రెండు నెలల క్రితం ప్రభుత్వ ప్రజా రవాణాను నిలిపివేసింది. దీంతో అప్పటి నుంచి బోసిపోయిన ఔటర్ రింగు రోడ్డు నేటి రాత్రి నుంచి తిరిగి తెరుచుకోనుంది. లాక్‌డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం నిన్న ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. తాజాగా, నేటి అర్ధరాత్రి నుంచి ఔటర్ రింగు రోడ్డుపై అన్ని రకాల వాహనాలకు హెచ్‌ఎండీఏ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా వాహనాల రాకపోకలను అనుమతించాలని హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నిర్ణయించాయి.

ఔటర్‌పై అన్ని రకాల వాహనాలను అనుమతిస్తున్న నేపథ్యంలో టోల్‌గేట్ సిబ్బంది పూర్తి భద్రతా చర్యలు పాటించాలని సూచించాయి. వాహనదారులు వీలైనంత వరకు నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని అధికారులు కోరారు. అయితే, రాత్రి ఏడు  నుంచి ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో ఓఆర్ఆర్‌పైకి ప్రయాణికుల కార్లను అనుమతించబోమని హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు.


More Telugu News