'సర్వనాశనం... కరోనా కన్నా అధిక నష్టం'... 'ఎమ్‌ఫాన్' తుపాను బీభత్సంపై మమతా బెనర్జీ

  • తాండవం ఆడిన ఎమ్‌ఫాన్ 
  • చాలా క్లిష్ట పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్
  • అధికారులతో పరిస్థితిని సమీక్షించిన మమత
ఎమ్‌ఫాన్ తుపానుతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సర్వనాశనం అయిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇదో ఉత్పాతమని అభివర్ణించిన ఆమె, ఎమ్‌ఫాన్ వార్ రూమ్ లో పరిస్థితిని అధికారులతో కలిసి సమీక్షించారు. ఎన్నో భవనాలు కుప్పకూలాయని, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, రహదారులు దెబ్బతిన్నాయని, చాలా చోట్ల వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించిందని ఆమె తెలిపారు. కరోనా వైరస్ కన్నా ఎమ్‌ఫాన్  తుపాను సృష్టించిన నష్టమే అధికమని మమతా బెనర్జీ అభివర్ణించారు.

తుపాను ప్రభావాన్ని గురించి వివరిస్తూ, 'ఎమ్‌ఫాన్ తాండవం ఆడింది' అని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. చాలా ఏళ్ల తరువాత బంగాళాఖాతం రాష్ట్రానికి అమిత నష్టాన్ని కలిగించిందని తెలిపారు. "నేను ఇప్పుడు వార్ రూమ్ లో కూర్చుని ఉన్నాను. నబన్నాలోని నా కార్యాలయం వణికిపోతోంది. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాము" అని ఆమె అన్నారు.

కాగా, ఈ తుపాను పశ్చిమ బెంగాల్ తీర ప్రాంత జిల్లాలతో పాటు నార్త్ అండ్ సౌత్ 24 పరగణాస్ జిల్లాలకు అధిక నష్టాన్ని కలిగించింది. 12 మంది ప్రాణాలను కోల్పోయారు. తీర ప్రాంతంలో గంటకు 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయగా, రోడ్లపై ఉన్న కార్లు కొట్టుకుపోయాయి. ఎన్నో చెట్లు, స్తంభాలు కుప్పకూలగా, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోల్ కతాలోని చాలా ప్రాంతాల్లో, పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొబైల్, ఇంటర్నెట్ సేవలపైనా ప్రభావం పడింది.


More Telugu News