కోల్‌కతా పోర్టు ట్రస్టు ఇక ‘శ్యామ ప్రసాద్ ముఖర్జీ ట్రస్టు’.. పేరు మార్చిన కేంద్రం

  • మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం
  • మొత్తం ఆరు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
  • దేశంలో ఎక్కడైనా  పంట ఉత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు
కోల్‌కతా పోర్టు ట్రస్ట్ పేరును ‘శ్యామ ప్రసాద్ ముఖర్జీ ట్రస్టు’గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పేరు మార్పునకు కేబినెట్ ఆమోదించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు. సమావేశంలో మొత్తం ఆరు నిర్ణయాలు తీసుకోగా వీటిలో మూడు వ్యవసాయ రంగానికి సంబంధించినవే కావడం గమనార్హం.

రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. పంట ఉత్పత్తులకు దేశంలో ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడ అమ్ముకోవచ్చు. ఇందులో ఎలాటి ఆంక్షలు ఉండవు. అలాగే, రైతులకు మేలు చేసేందుకు నిత్యావసర చట్టాన్ని సవరించాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీటితోపాటు దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ సెల్స్‌ (పీడీసీ)కు ప్రభుత్వం అనుమతి ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు జవదేకర్ తెలిపారు.


More Telugu News