ఢిల్లీలో హింస, విధ్వంసం కోసం రూ.1.10 కోట్లు ఖర్చుపెట్టిన కౌన్సిలర్

  • పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఫిబ్రవరిలో ఆందోళనలు 
  • 14 మందిపై 1,030 పేజీల ఛార్జిషీటు దాఖలు
  • కుట్ర వెనుక ఓ సంస్థకు చెందిన ఖలీద్ సైఫీ
  • ట్రంప్ పర్యటిస్తోన్న సందర్భంగా భారీ కుట్ర
ఈశాన్య ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన హింస, విధ్వంసం కేసుల్లో విచారణ జరుపుతోన్న పోలీసులు ఆమ్‌ ఆద్మీ పార్టీ బహిష్కృత కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేన్‌తో పాటు మరో 14 మందిపై  1,030 పేజీల ఛార్జిషీటు దాఖలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనల కోసం ఆయన రూ.1.10 కోట్ల నిధులు ఖర్చు చేశారని పోలీసులు తెలిపారు.

ఈశాన్య ఢిల్లీలో హింస చెలరేగడానికి నెల రోజుల ముందు ఆయన జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్‌తో పాటు లాభాపేక్ష లేని ఓ సంస్థకు చెందిన ఖలీద్ సైఫీ అనే వ్యక్తిని కలిశాడని తెలిపారు. ఈ కేసులో ఉమర్ ఖలీద్‌పై ఏప్రిల్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తోన్న సందర్భంగా ఏదైనా పెద్ద చర్యకు పాల్పడడానికి ప్రణాళిక వేసుకోవాలని హుసేన్‌కు సైఫీ చెప్పాడు. అలాగే అతడికి డబ్బు కూడా ఇచ్చాడు. తనతో పాటు తన కంపెనీల ఖాతాల్లో సైఫీ జనవరిలో రూ.1.10 కోట్ల నిధులు జమచేశాడని హుసేన్ పోలీసులకు తెలిపాడు.

ఆ డబ్బును హుసేన్‌ సీఏఏ ఆందోళనకారులకు పంచుతూ విధ్వంసానికి ప్రోత్సహించాడు. కాగా, హుసేన్‌ వద్ద లైసెన్స్డ్ తుపాకీ కూడా ఉంది. సీఏఏకి మద్దతు తెలుపుతున్న వారి నుంచి హాని ఉందని ఆయన ఆ తుపాకీని తీసుకున్నాడు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్‌ శర్మ హత్య వెనుక  భారీ కుట్ర ఉందని, అందులో తాహిర్‌ హుస్సేన్‌ పాత్ర ఉందని  పోలీసులు చెప్పారు.


More Telugu News