'కాలూ' అని నన్ను ఎవరైనా పిలిస్తే సన్ రైజర్స్ ఆటగాళ్లంతా నవ్వేవాళ్లు: సామీ

  • తనని 'కాలూ' అని పిలిచేవాళ్లని సామీ ఆవేదన
  • వాళ్లెవరో తనకు తెలుసని వెల్లడి
  • వాళ్లందరితో మాట్లాడతానంటూ ఓ వీడియోలో స్పష్టీకరణ
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ దురదృష్టకర రీతిలో మరణించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా నల్లజాతీయులు తమకు ఎదురైన జాత్యహంకార ఘటనలను ప్రస్తావిస్తున్నారు. వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ సామీ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాలపై ఎలుగెత్తాడు. ఐపీఎల్ లో ఆడే సమయంలో సొంత జట్టు ఆటగాళ్లే తనను జాతి వివక్ష ధ్వనించేలా పిలవడం ఇప్పుడు ఎంతో బాధిస్తోందని తెలిపాడు. 'కాలూ' అనే పదంతో తనను పిలిచేవాళ్లని, అప్పట్లో ఆ పదానికి తనకు అర్థం తెలియలేదని, ఇప్పుడు ఆ పదానికి అర్థం తెలిసిన తర్వాత తీవ్ర ఆగ్రహం కలుగుతోందని అన్నాడు. తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసిన సామీ... మరింత తీవ్రంగా స్పందించాడు.

"ప్రపంచవ్యాప్తంగా నేను క్రికెట్ ఆడాను. అన్ని దేశాల్లోనూ నాకు అభిమానులు ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడే సమయంలో నన్ను 'కాలూ' అని ఎవరైనా పిలిస్తే ఇతర ఆటగాళ్లంతా నవ్వేవాళ్లు. అందరూ నవ్వుతుంటే అదేదో తమాషా మాట అయ్యుంటుందని తేలిగ్గా తీసుకున్నాను. అయితే 'కాలూ' అనే పదానికి అర్థం తెలిసిన తర్వాత స్పందించకుండా ఉండలేకపోతున్నాను. నన్ను ఆ పదంతో పిలిచిందెవరో వాళ్లకూ తెలుసు, నాకూ తెలుసు. వాళ్లందరితో మాట్లాడతాను. ఒకవేళ వాళ్లు చెడు ఉద్దేశంతో ఆ పదం ఉపయోగించి ఉంటే ఎంతో నిరుత్సాహానికి గురవుతాను" అంటూ స్పందించారు.


More Telugu News