జగన్‌పై ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు బాధాకరం: వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు

  • కరోనా సమయంలో కూడా జగన్ అందరినీ కలుస్తున్నారు
  • ఎంపీ స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం బాధాకరం
  • మనస్పూర్తిగా ఆయనను కలవాలనుకుంటే కలవొచ్చు
ముఖ్యమంత్రి జగన్ ను కలిసే అవకాశం కొందరికి తప్ప మరెవరికీ లభించడం లేదని వైసీపీ నరసాపురం ఎంపీ రాఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సమస్యలను ఆయనకు చెప్పుకునే అవకాశం లేకపోవడం వల్లే కొందరు పార్టీ ప్రజాప్రతినిధులు వారి సమస్యలను మీడియాతో చెప్పుకున్నారని అన్నారు. ఇందులో జగన్ తప్పు లేదని... ఆయన చుట్టూ ఉండే కోటరీదే తప్పని ఆరోపించారు.

 ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు తప్పుపట్టారు. కరోనా సమయంలో కూడా జగన్ అందరితో కలుస్తున్నారని ఆయన చెప్పారు. ఆయనను కలవాలనే ఆలోచన మనస్పూర్తిగా ఉంటే... తప్పకుండా కలిసే అవకాశం ఉందని అన్నారు. జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఎంపీ స్థాయి వ్యక్తి మాట్లాడటం బాధాకరమని... ఆయన వ్యాఖ్యలు ప్రార్టీ శ్రేణులకు బాధను కలిగించాయని చెప్పారు. పక్క చూపులు చూడాల్సిన అవసరం జగన్ కు లేదని... ఏ చూపు చూస్తే మీరు పార్లమెంటు కమిటీ పదవి దక్కించుకున్నారని ప్రశ్నించారు. మరోవైపు, రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు వైసీపీలో అంతర్గతంగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.


More Telugu News