మరోసారి విన్నవిస్తున్నా.. అనవసరంగా కరోనా పరీక్షలు చేయించుకోవద్దు: ఈటల రాజేందర్

  • డబ్బులు ఉన్నాయని చీటికి మాటికి పరీక్షలు చేయించుకోవద్దు
  • మూడు, నాలుగు రోజుల్లో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభమవుతుంది
  • ప్రభుత్వంపై బురద చల్లేందుకు కొందరు యత్నిస్తున్నారు
కరోనా లక్షణాలుంటేనే పరీక్షలు చేయించుకోవాలని.. ఈ విషయాన్ని మరోసారి విన్నవిస్తున్నానని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. లక్షణాలు లేనివారు పరీక్షలు చేయించుకోవద్దని చెప్పారు. ప్రైవేట్ ల్యాబ్స్ కు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశామని... అనవసరంగా టెస్టులు చేయవద్దని సూచించామని తెలిపారు.  డబ్బులు ఉన్నాయి కదా అని చీటికి మాటికి టెస్టులు చేయించుకోవద్దని అన్నారు. గచ్చిబౌలిలోని టిమ్స్ ను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

టిమ్స్ లో 1000 బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం కల్పించామని ఈటల తెలిపారు. మూడు, నాలుగు రోజుల్లో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభమవుతుందని, ఇప్పటికే ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య రంగంలో కేరళ, తమిళనాడుతో పోటీ పడుతున్నామని... అనేక సంస్కరణలను తీసుకొచ్చామని వెల్లడించారు.

ఇంత చేస్తున్నా ప్రభుత్వంపై బురద చల్లేందుకు కొందరు యత్నిస్తున్నారని చెప్పారు. కరోనా పేషెంట్లకు సేవ చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మెద్దని కోరారు. హోం ఐసొలేషన్ లో ఉండే  వీలులేనివారికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుందని... ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఐసొలేషన్ లో ఉంచుతామని చెప్పారు.


More Telugu News