కరోనా వ్యాక్సిన్ వస్తే.. మొదటి ప్రాధాన్యత వీళ్లకే: ప్రధాని మోదీ

  • కరోనా వ్యాక్సిన్ అంశంపై ప్రధాని సమీక్ష
  • పలు సూచనలు చేసిన ప్రధాని
  • ధర కారణంగా ఎవరూ వ్యాక్సిన్ కు దూరం కారాదన్న మోదీ
యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా భూతాన్ని పారదోలే వ్యాక్సిన్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పరిశోధక సంస్థలు, శాస్త్రవేత్తలు యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారీ కోసం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారత్ లో కరోనా వ్యాక్సిన్ తయారీ, అభివృద్ధి, పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతస్థాయి అధికారులు హాజరయ్యారు.

అయితే, కరోనాకు వ్యాక్సిన్ వస్తే మొదట ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలన్న దానిపై మోదీ కీలక సూచనలు చేశారు. కరోనా వైరస్ పై ముందు నిలిచి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, కరోనా బారిన పడేందుకు అత్యధిక అవకాశాలు ఉన్న వారికి మొదటగా వ్యాక్సిన్ అందించాలని స్పష్టం చేశారు. ఆ తర్వాతే దేశ వ్యాప్త పంపిణీపై దృష్టి సారించాలని అన్నారు.

రెండో దశలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలని, వ్యాక్సిన్ పంపిణీకి ఎలాంటి ఆంక్షలు ఉండరాదని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి వ్యాక్సిన్ వెళ్లాల్సిందేనని తెలిపారు. ముఖ్యమైన అంశం ఏమిటంటే, కరోనా వ్యాక్సిన్ ధర అందరికీ అందుబాటులో ఉండాలని, ధర కారణంగా ఎవరూ వ్యాక్సిన్ కు దూరమయ్యే పరిస్థితి రాకూడదని అన్నారు. వ్యాక్సిన్ అన్ని దశలు పూర్తి చేసుకుని బయటికి వచ్చాక... ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు టెక్నాలజీ సాయంతో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. నిర్ణీత సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు చేయాలని పేర్కొన్నారు.


More Telugu News