గుంటూరు జిల్లాలో మధ్యవయసు వారిని భయపెడుతున్న కరోనా

  • జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో 25-50 ఏళ్ల మధ్యనున్న వారే అధికం
  • వేగంగా కోలుకుంటున్నది కూడా వారే
  • వైద్యాధికారుల పరిశీలనలో వెల్లడి 
కరోనా వైరస్‌కు సంబంధించి మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మహమ్మారి బారినపడుతున్న వారిలో మధ్యవయసు వారే ఎక్కువని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ప్రొఫెషనల్స్, కార్మికులు, కర్షకులు ఎక్కువగా ఉన్నారు. ఉపాధి నిమిత్తం వీరంతా రాకపోకలు సాగిస్తుండడం వల్లే వీరు వైరస్ బారినపడుతున్నట్టు తేలింది. గుంటూరు జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది వీరే ఉన్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నా బేఖాతరు చేస్తున్నారని పేర్కొన్నారు.

శనివారం నాటికి జిల్లాలో 1874 కేసులు నమోదు కాగా, వారిలో 25-50 ఏళ్ల మధ్యనున్న వారే ఎక్కువగా ఉన్నట్టు వైద్యాధికారుల పరిశీలనలో తేలింది. మొత్తంగా నమోదైన 1874 కేసుల్లో 1188 మంది వీరే ఉన్నారు. అయితే, ఊరటనిచ్చే విషయం ఏమిటంటే.. వైరస్ నుంచి త్వరగా కోలుకుంటున్న వారు కూడా వీరే కావడం. దాదాపు 95 శాతం మంది కోలుకుంటున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే 611 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 577 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది కరోనాతో మృతి చెందగా వారిలో మధ్యవయస్కులు ఐదుగురే. ఇక, కరోనా బారినపడి మరణిస్తున్న వారిలో 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 19 మంది కరోనాతో మరణించారు.


More Telugu News