భక్తుల్లేని బోనాలు... చరిత్రలో ఇదే తొలిసారి అని వెల్లడించిన తలసాని

  • మహంకాళికి అమ్మవారికి తొలి బోనం సమర్పణ
  • భక్తుల్లేక వెలవెలబోయిన బోనాలు
  • ఇళ్ల వద్దనే బోనాలు జరుపుకుంటున్న ప్రజలు
నాలుగు వందల ఏళ్ల హైదరాబాద్ నగర చరిత్రలో బోనాలకు ప్రత్యేక స్థానం ఉంది. భక్తుల కోలాహలం, గణాచారులు ఉత్సాహం, ఆలయాల వద్ద విపరీతమైన జనసందోహం... ప్రతి ఏడాది బోనాల సమయంలో హైదరాబాదులో కనిపించే దృశ్యాలివి. కానీ ఈసారి భక్తులు లేకుండానే బోనాలు ప్రారంభమయ్యాయి. భక్తులెవరూ లేకుండానే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఇలా భక్తుల్లేకుండా బోనాలు సమర్పించడం చరిత్రలోనే లేదని వెల్లడించారు.

భక్తుల్లేకపోయినా, ఆచార సంప్రదాయలను కచ్చితంగా పాటిస్తూ బోనాల వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. లాల్ దర్వాజా బోనాలను కూడా ఇదే తరహాలో నిర్వహిస్తామని తలసాని తెలిపారు. అటు, కరోనా వ్యాప్తి కారణంగా ప్రజలు ఇళ్ల వద్దనే బోనాల ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఈ విధంగా తమకు సహకరిస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు తలసాని పేర్కొన్నారు. కాగా, ఈసారి బోనాలను తలసాని అర్ధాంగి సమర్పించినట్టు తెలుస్తోంది.


More Telugu News