ఐపీఎల్ వ్యవహారంలో దక్కన్ చార్జర్స్ కు ఊరట... రూ. 4,800 కోట్లు చెల్లించాలని బీసీసీఐకి ఆదేశం!

  • 2012లో బ్యాంకు గ్యారంటీ చూపడంలో డీసీ విఫలం
  • ఆ వెంటనే కాంట్రాక్టును రద్దు చేసిన బీసీసీఐ
  • రద్దు అన్యాయమని తాజాగా తీర్పు
ఎనిమిది సంవత్సరాల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తొలగింపుకు గురైన దక్కన్ చార్జర్స్ కు ఊరట లభించింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన వేళ, హైదరాబాద్ టీమ్ ను దక్కన్ క్రానికల్స్ హోల్డింగ్స్ కొనుగోలు చేసి, ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఆపై 2009లో దక్కన్ చార్జర్స్ జట్టు ఐపీఎల్ కప్ ను గెలుచుకుంది. 2012లో రూ. 100 కోట్ల బ్యాంకు గ్యారంటీని చూపించలేదంటూ ఆరోపించిన బీసీసీఐ, దక్కన్ చార్జర్స్ ను రద్దు చేయగా, 2013లో సన్ నెట్ వర్క్ ప్రవేశించి, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ప్రకటించింది.

తమ తొలగింపు అక్రమ నిర్ణయమని ఆరోపిస్తూ, డీసీహెచ్ఎల్ ముంబై కోర్టును ఆశ్రయించగా, రిటైర్డ్ జస్టిస్ సీకే ఠక్కర్ నేతృత్వంలో మధ్యవర్తిత్వ కమిటీని కోర్టు నియమించింది. ఆపై వాదనలు ప్రారంభం అయ్యాయి. ఎన్నో పెద్ద తప్పులకు జరిమానాలతో సరిపెట్టే బోర్డు, ఎంతో చిన్న తప్పుకే తమకు తీవ్రమైన అన్యాయం చేసిందని డీసీ వాదించింది. తమకు రూ. 8 వేల కోట్లు కట్టాలని డీసీ డిమాండ్ చేయగా, తమకే ఖర్చుల కింద రూ. 214 కోట్లు ఇప్పించాలని బీసీసీఐ కోరింది.

 అప్పటి నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు సాగిన కేసులో చివరికి దక్కన్ చార్జర్స్ వాదనే నెగ్గింది. ఈ కేసులో డీసీ ఫ్రాంచైజీకి జరిగిన నష్టానికి పరిహారంగా రూ. 4,800 కోట్లు చెల్లించాలని ఠక్కర్ ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేయాలని బీసీసీఐ న్యాయ సలహాలు తీసుకుంటోంది. తీర్పు కాపీని పూర్తిగా పరిశీలించిన తరువాత దీన్ని సవాల్ చేసే విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ సీఈఓ హేమంగ్ అమీన్ వ్యాఖ్యానించారు.


More Telugu News