ఆ రెండు బిల్లులు రాజ్యాంగ విరుద్ధం... ఆమోదించవద్దు: గవర్నర్ కు లేఖ రాసిన కన్నా

  • బిల్లులను గవర్నర్ కు పంపిన ఏపీ ప్రభుత్వం
  • ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజల మద్దతు లేదన్న కన్నా
  • ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి
మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులను గవర్నర్ తో ఆమోదింపజేసుకోవాలని ఏపీ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉండగా, విపక్ష నేతలు మాత్రం అవి రాజ్యాంగ వ్యతిరేకం అంటూ వ్యతిరేకిస్తున్నారు. ఆ రెండు బిల్లులను సర్కారు గవర్నర్ వద్దకు పంపిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెంటనే స్పందించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు.

రాష్ట్ర ప్రజలు ఎవరూ ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించడంలేదని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన వికేంద్రీకరణ బిల్లు తదితర బిల్లులకు ఆమోదం తెలుపవద్దని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే, వికేంద్రీకరణ బిల్లు ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని వివరించారు. ఈ బిల్లులపై ప్రజలు, రైతుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. రాజధాని ప్రాంత ప్రజల శాంతియుత నిరసనలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు. 


More Telugu News