ఏళ్లుగా పరిష్కారం కాని విద్యుత్ సమస్య.. ఒక్కొక్కరిగా పిలిచి విద్యుత్ అధికారులను కట్టేసిన గ్రామస్థులు

  • మెదక్‌లోని అల్లాదుర్గం మండలంలో ఘటన
  • లో వోల్టేజీ సమస్యలతో ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు
  • బిల్ కలెక్టర్లు సహా లైన్‌మ్యాన్, ఏఈని నిర్బంధించిన గ్రామస్థులు
ఏళ్ల తరబడి పరిష్కారం కాని విద్యుత్ సమస్యను చక్కదిద్దుకునేందుకు గ్రామస్థులంతా ఒక్కటయ్యారు. గ్రామంలో బిల్లుల వసూల కోసం వచ్చిన సిబ్బందిని పట్టుకుని కట్టేసిన గ్రామస్థులు ఆ తర్వాత ఒక్కొక్కరినీ పిలిచి బంధించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో జరిగిందీ ఘటన.

మండలంలోని గడిపెద్దాపూర్ సబ్‌స్టేషన్ నుంచి ముస్లాపూర్, ముస్లాపూర్ తండా, గడిపెద్దాపూర్, తండాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా లో వోల్టేజ్ సమస్య ఉండడంతో ఇళ్లలోని గృహోపకరణాలు తరచూ కాలిపోతున్నాయి. ముస్లాపూర్‌లోని బోరు బావులు, గ్రామానికి ఒకే ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుండడంతోనే ఈ సమస్య వస్తోంది. దీంతో సమస్య పరిష్కరించాల్సిందిగా ఏళ్ల తరబడి గ్రామస్థులు చేస్తున్న విజ్ఞప్తులు పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.

దీంతో విసిగిపోయి ఉన్న గ్రామస్థులు నిన్న విద్యుత్ బిల్లులు వసూలు చేసేందుకు గ్రామానికి వచ్చిన బిల్ కలెక్టర్లు రవి, ఏసయ్యలను నిర్బంధించారు. అనంతరం లైన్‌మ్యాన్ నవాజ్‌కు సమాచారం అందించారు. అతడు రాగానే ముగ్గుర్నీ తీసుకెళ్లి కొత్తగా నిర్మిస్తున్న పంచాయతీ కార్యాలయ భవనంలోని పిల్లరుకు కట్టేశారు. ఆ తర్వాత ఏఈ రాంబాబుకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి ఆయన రాగానే నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారు. అల్లాదుర్గం ఎస్సై వెంటనే గ్రామానికి చేరుకుని గ్రామస్థులతో చర్చించారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బంధించిన విద్యుత్ సిబ్బందిని గ్రామస్థులు విడిచిపెట్టారు.


More Telugu News