అయోధ్య రామాలయం డిజైన్, నిర్మాణానికి పట్టే కాలం.. వివరాలు!

  • పాత డిజైన్ తో పోలిస్తే 20 అడుగులు పెరిగిన ఆలయం ఎత్తు
  • కొత్త డిజైన్ లో చేరిన రెండు మండపాలు
  • మూడు లేదా మూడున్నర ఏళ్లలో పూర్తికానున్న నిర్మాణం
అయోధ్య రామ మందిర నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. వచ్చే నెల 5న భూమిపూజ జరగనుంది. 3వ తేదీ నుంచి క్రతువులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని మోదీ, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, అమిత్ షా, ఉమా భారతి తదితర 50 మంది వీవీఐపీలు భూమిపూజ కార్యక్రమానికి హాజరవనున్నారు. రామ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుందని ఈ సందర్భంగా టెంపుల్ చీఫ్ ఆర్కిటెక్ట్ సి.సోంపుర కుమారుడు నిఖిల్ సోంపుర తెలిపారు. నిఖిల్ కూడా ఆర్కిటెక్ట్ కావడం గమనార్హం.

వాస్తవానికి 1988లో తయారు చేసిన డిజైన్ లో ఆలయం ఎత్తు 141 అడుగులుగా ఉంది. దీంతో, తాజాగా ఆలయం ఎత్తును మరో 20 అడుగులు పెంచినట్టు తెలుస్తోంది. కొత్త డిజైన్ లో రెండు మండపాలను కూడా చేర్చామని నిఖిల్ తెలిపారు. గత డిజైన్ ఆధారంగా చెక్కిన పిల్లర్లు, ఇతర రాతి ఫలకాలను ఆలయ నిర్మాణంలో ఉపయోగిస్తామని చెప్పారు.

ఇక ఆలయ నిర్మాణానికి మూడు నుంచి మూడున్నర సంవత్సరాల సమయం పట్టవచ్చని తెలిపారు. ప్రధాని మోదీ సమక్షంలో భూమిపూజ జరిగిన వెంటనే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇప్పటికే నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కావాల్సిన మెటీరియల్, మెషినరీతో చేరుకుందని తెలిపారు.


More Telugu News