ఉత్తరకొరియాలోకి ఎంట్రీ ఇచ్చిన కరోనా వైరస్‌

  • ఉత్తరకొరియా అధికారిక ప్రకటన
  • కేసాంగ్ నగరంలో లాక్‌డౌన్
  • అధికారులతో కిమ్‌ సమీక్ష
  • అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశం
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ఉత్తరకొరియాలోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. నిన్న రాత్రి కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తికి పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఉత్తరకొరియా అధికారికంగా ప్రకటించింది. ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన తొలి కేసు ఇదే. కరోనా కేసు నమోదు కావడంతో వైరస్‌ విజృంభించకుండా కేసాంగ్ నగరంలో లాక్‌డౌన్ విధించారు.

కరోనా కేసు నమోదు కావడంతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కరోనా‌ లక్షణాలున్న ప్రతి ఒక్కరిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని, అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు.

కాగా, ఉత్తరకొరియా వ్యాప్తంగా మొత్తం 976 పరీక్షలు నిర్వహించామని, ఏ ఒక్కరినీ కరోనా పాజిటివ్‌గా తేలలేదని అధికారులు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు చెప్పారు. అలాగే, కరోనా లక్షణాలున్న 25,551 మందిని క్వారంటైన్‌లో ఉంచామని వారు వివరించారు. ఈ విషయాలన్నింటినీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపామని చెప్పారు.

దేశంలో తొలి కేసు నమోదైన నేపథ్యంలో సంబంధిత అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కిమ్ జోంగ్‌ ఉన్ సూచనలు చేశారు. చైనా సరిహద్దులను ఇప్పట్లో తెరవబోమని కిమ్‌ అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన నిబంధనలు విధించారు. మరోవైపు దక్షిణ కొరియాలోనూ ప్రతిరోజు పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.  



More Telugu News