సోషల్ మీడియాలో వేధింపులు.. తమిళ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం

  • వేధింపులు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానన్న నటి
  • ఇదే తన చివరి వీడియో అంటూ ఫేస్‌బుక్‌లో వీడియో
  • ప్రస్తుతం నిలకడగానే ఆరోగ్యం
సోషల్ మీడియాలో తనపై వేధింపులు ఎక్కువవుతున్నాయంటూ తమిళ, కన్నడ నటి విజయలక్ష్మి ఆత్మహత్యకు యత్నించారు. అంతకుముందు ఫేస్‌బుక్‌లో వీడియోలు పోస్టు చేసిన నటి ‘నామ్ తమిళర్’ పార్టీ నేత సీమన్, ‘పన‌న్‌కట్టు పడై’కి చెందిన హరి నాడార్ మద్దతుదారులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని, అందుకనే రక్తపోటు పడిపోయి మరణం సంభవించే పిల్స్ వేసుకున్నానని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.

ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఇదే తన చివరి వీడియో అని,  సీమన్, అతడి పార్టీ కార్యకర్తల వల్ల గత నాలుగు నెలలుగా తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. హరి నాడార్ మీడియాలో తనను అవమానించారని, మరి కాసేపట్లో తన బీపీ పడిపోతుందని, ఆ తర్వాత ప్రాణం పోతుందని పేర్కొన్నారు. అంతేకాదు, చావు కనువిప్పు కావాలని, తనను వేధింపులకు గురిచేసిన సీమన్, హరినాడార్‌లను విడిచిపెట్టవద్దని తన అభిమానులను కోరారు.

విజయలక్ష్మి పేర్కొన్న ‘నామ్ తమిళర్ కచ్చి’ జాతీయ పార్టీ. తమిళనాడు, పుదుచ్చేరిలో పనిచేస్తోంది. సీమాన్ ఈ పార్టీ నాయకుడే.  రాజకీయ సంస్థ ‘పనన్‌కట్టు పాడై’కి చెందిన హరి నాడార్ గత ఏడాది అక్టోబర్‌లో తమిళనాడులో జరిగిన నంగునేరి అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు.


More Telugu News