సుప్రీం విచారణకు గంటల ముందు... సచిన్ పైలట్ పై కేసు విత్ డ్రా చేసుకునే ఆలోచనలో కాంగ్రెస్!

  • సమస్యను పార్టీలోనే పరిష్కరించుకుందాం
  • అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్న కాంగ్రెస్ సీనియర్లు
  • కోర్టులోనే తేల్చుకుందామంటున్న కొందరు
రాజస్థాన్ సంక్షోభ కేసును ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. నేడు సుప్రీం కోర్టులో సచిన్ పైలట్ వర్గం అనర్హతపై కేసు విచారణకు రానున్న నేపథ్యంలో, ఈ కేసు పిటిషన్ ను వెనక్కు తీసుకుని, సమస్యను అంతర్గతంగానే పరిష్కరించుకుందామని ఓ వర్గం అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరు మాత్రం కోర్టులోనే తేల్చుకుందామని అంటున్నట్టు సమాచారం. ఈ విషయంలో కోర్టులో విచారణ ప్రారంభమయ్యేలోగా నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

గత వారంలో కాంగ్రెస్ రెబల్ నాయకుడు సచిన్ పైలట్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించి, తాత్కాలిక ఉపశమనాన్ని పొందిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను చాలెంజ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. స్పీకర్ అధికారాలు నిర్ణయించేంత వరకూ సచిన్ పైలట్ వర్గంపై ఏ విధమైన చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది. మరోవైపు అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి, బలాన్ని నిరూపించుకోవాలని గెహ్లాట్ వర్గం తమవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలను గవర్నర్ కల్ రాజ్ మిశ్రా అడ్డుకుని, అసెంబ్లీ సమావేశమయ్యేందుకు అంగీకరించలేదు. 

హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై పిటిషన్ విచారణ దశలో ఉన్న నేపథ్యంలో అసెంబ్లీని సమావేశపరచలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కేసును విత్ డ్రా చేసుకుని సమస్యను పరిష్కరించుకుంటేనే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నారు.


More Telugu News