ఎట్టకేలకు తెలంగాణ సచివాలయ కూల్చివేత ప్రాంతానికి జర్నలిస్టులకు అనుమతి

  • ఈ రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు వెళ్లనున్న మీడియా ప్ర‌తినిధులు
  • బీఆర్కే భ‌వ‌న్ నుంచి తీసుకెళ్లనున్న పోలీసులు  
  • భవనాల కూల్చివేత పనులు దాదాపు 90 శాతం పూర్తి
తెలంగాణ స‌చివాల‌య భ‌వ‌నాల‌ కూల్చివేత కవరేజీకి మీడియాను ఎందుకు అనుమతించట్లేదని, దీనిపై గోప్యత ఎందుకని ఇటీవల హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో ఎట్టకేలకు సచివాలయ భవనాల కూల్చివేత ప‌నుల వ‌ద్ద‌కు వెళ్లేందుకు మీడియాకు ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది. ఈ రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు మీడియా ప్ర‌తినిధుల‌ను బీఆర్కే భ‌వ‌న్ నుంచి నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత ప‌నుల వ‌ద్ద‌కు తీసుకెళ్లనున్నారు.

కాగా, ఇప్పటికే సచివాలయ భవనాల కూల్చివేత పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. శిథిలాల తరలింపు పనులు కూడా కొనసాగుతున్నాయి. భవనాలు కూల్చివేసే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతోనే ఇప్పటివరకు ఇతరులెవ్వరినీ అనుమతించలేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొస్తోంది.

అయితే, సచివాలయ భవనం కింద గుప్త నిధులు ఉన్నాయని, అందుకే అనుమతి ఇవ్వలేదని కొందరు చేసిన ప్రచారం అలజడి రేపింది. సచివాలయ పనుల కూల్చివేతను చూడడానికి అనుమతివ్వాల్సిందేనని ఇటీవల ఓ తెలుగు మీడియా సంస్థ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు కూడా ప్రభుత్వ తీరుపై అభ్యంతరాలు తెలపడంతో మీడియాను అనుమతిస్తున్నారు.


More Telugu News