హీరో సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం!

  • కేసును పోలీసులు విచారిస్తున్నారన్న సుప్రీంకోర్టు
  • వారి పనిని వారిని చేసుకోనివ్వాలని వ్యాఖ్య
  • సుశాంత్‌ సింగ్‌ చాలా మంచివాడన్న పిటిషనర్ 
  • సుశాంత్‌ మంచివాడా? అన్న అంశంతో సంబంధం లేదన్న కోర్టు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసును కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)కి అప్పగించాలని అల్కాప్రియ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారని, వారి పనిని వారిని చేసుకోనివ్వాలని వ్యాఖ్యానించింది.

 సుశాంత్‌ సింగ్‌ చాలా మంచివాడని ఈ సందర్భంగా  పిటిషనర్ చెబుతూ, ఆయన సామాజిక సేవలో ముందుండేవాడని, కొందరు పిల్లలను నాసా శిక్షణ కోసం కూడా పంపేందుకు సాయం చేశాడని తెలిపారు. అయితే, సుశాంత్‌ మంచివాడా? కాదా? అన్న అంశంతో సంబంధం లేదని, ఈ కేసును ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సుప్రీం వ్యాఖ్యానించింది.

కాగా, గత నెల 14న సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన తీవ్ర ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. ఇప్పటికే పోలీసులు దాదాపు 40 మందిని విచారించారు. కాగా, సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిపై పాట్నా పోలీసులకు అతడి తండ్రి ఫిర్యాదు చేస్తూ, తన కుమారుడి బ్యాంక్ ఖాతా నుంచి 15 కోట్లు బదిలీ అయ్యాయనీ, అవి రియా అకౌంటుకు వెళ్లాయని చెప్పారు. అయితే, తనపై నమోదైన కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని రియా ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది.


More Telugu News