తొలి సినిమా దర్శకుడితో రామ్ చరణ్?

  • చరణ్ తదుపరి సినిమాపై ఊహాగానాలు 
  • పూరి జగన్నాథ్ తో ఇటీవల చరణ్ చర్చలు 
  • పూరి 'చిరుత' ద్వారానే చరణ్ పరిచయం
  • కె.ఎస్.రామారావు బ్యానర్లో నిర్మాణం  
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని చేస్తున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. తన తదుపరి చిత్రాన్ని చరణ్ ఫలానా దర్శకుడితో చేస్తాడంటూ పలురకాల వార్తలు వచ్చినప్పటికీ, ఇంకా ఏదీ ఖరారు కాలేదు. ఈ లాక్ డౌన్ ఖాళీ సమయంలో మిగతా హీరోల్లానే చరణ్ కూడా పలువురు దర్శకులు చెప్పిన కథలు వినడం జరిగింది.

ఈ క్రమంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చరణ్ ఓ చిత్రాన్ని చేయనున్నాడంటూ తాజాగా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల పూరి, చరణ్ మధ్య ఈ విషయమై చర్చలు జరిగాయనీ, పూరి చెప్పిన కథ చరణ్ కు నచ్చిందని అంటున్నారు. దీనిపై ప్రస్తుతం వర్క్ జరుగుతోందట. దీనిని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తారని తెలుస్తోంది. 

అసలు చరణ్ ను హీరోగా చిత్రసీమకు పరిచయం చేసింది పూరీనే. 'చిరుత' సినిమా ద్వారా చరణ్ ను పూరి పరిచయం చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించి, చరణ్ కెరీర్ కి బాటలు వేసింది. అయితే, ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాలేదు. అది మళ్లీ ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చనుందని సమాచారం.  


More Telugu News