వందల ఏళ్ల నిరీక్షణ ముగిసింది.. నరుడిని నారాయణుడితో కలిపే ఘట్టమిది: భావోద్వేగానికి గురైన మోదీ

  • రామమందిరం కోసం ఎందరో బలిదానాలు చేశారు
  • దశాబ్దాల పాటు రామ్ లల్లా ఆలయం టెంట్ లోనే కొనసాగింది
  • దేశ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం
అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజను నిర్వహించిన అనంతరం... అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మాట్లాడుతూ ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఇదొక చారిత్రాత్మక దినమని చెప్పారు. వందల ఏళ్ల నిరీక్షణ ఈరోజు ముగిసిందని చెప్పారు. దేశ ప్రజలందరి ఆకాంక్షలతో రామ మందిరం నిర్మాణం జరుపుకుంటోందని తెలిపారు.

దశాబ్దాల పాటు రామ్ లల్లా ఆలయం టెంట్ లోనే కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామ మందిర నిర్మాణం కోసం ఎందరో పోరాటం చేశారని, బలిదానం చేశారని చెప్పారు. వారందరి బలిదానాలతో, త్యాగాలతో రామమందిర నిర్మాణం సాకారమవుతోందని అన్నారు. 130 కోట్ల ప్రజలు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం జరిగిందని... వారి పోరాటంతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని... అదే విధంగా రామాలయం కోసం కూడా పెద్ద పోరాటం జరిగిందని అన్నారు.

రాముడి కార్యక్రమాలన్నింటినీ హనుమంతుడు చూస్తాడని... హనుమంతుడి ఆశీస్సులతోనే ఈరోజు మందిర నిర్మాణం ప్రారంభమైందని మోదీ అన్నారు. కోటాను కోట్ల హిందువులకు ఆలయ నిర్మాణం ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. దేశ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయమని అన్నారు. ఇదొక అద్భుతమైన సందర్భమని... నరుడిని నారాయణుడితో కలిపే ఘట్టమని చెప్పారు. ఈరోజు దేశమంతా రామమయం అయిందని అన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయని చెప్పారు.


More Telugu News