పాక్‌కు చెందిన ధోనీ వీరాభిమాని కీలక ప్రకటన

  • ధోనీ వీరాభిమానిగా పాక్ వ్యక్తి మహ్మద్ బషీర్ కు గుర్తింపు
  • చికాగోలో రెస్టారెంట్ నడుపుతున్న బషీర్
  • ఇకపై క్రికెట్ చూడటానికి వెళ్లనని ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ తీసుకున్న నిర్ణయం క్రికెట్ అభిమానులకు మింగుడుపడటం లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ధోనీ విన్యాసాలను మరింత కాలం వీక్షించాలని ఆశపడిన వారంతా ఆయన నిర్ణయంతో నిరాశకు గురయ్యారు. మన దేశంలోనే కాకుండా అన్ని దేశాల్లోనూ ధోనీకి వీరాభిమానులున్నారు. మన శత్రు దేశమైన పాకిస్థాన్ లో సైతం ధోనీకి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

'చాచా చికాగో'గా పేరుగాంచిన పాక్ వ్యక్తి మహ్మద్ బషీర్ ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత... ఇక నుంచి క్రికెట్ చూడటానికి తాను వెళ్లనని ఆయన ప్రకటించారు. ధోనీ వీరాభిమానిగా బషీర్ కు గుర్తింపు ఉంది. ధోనీ ఆటను చూసేందుకు ఆయన ప్రతి మ్యాచ్ కు విదేశాలకు కూడా వెళ్లేవారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... బషీర్ కు కొన్ని సందర్భాల్లో ధోనీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసేవారు. అమెరికాలోని చికాగోలో ఆయన రెస్టారెంట్ నడుపుతున్నారు. ధోనీని పలుమార్లు వ్యక్తిగతంగా కలిశారు. ఆయన రెస్టారెంట్ లో ధోనీతో కలిసి దిగిన ఫొటోలు, సెల్ఫీలు ఉంటాయి.

ధోనీ ఐలవ్యూ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించి స్టేడియంలో బషీర్ సందడి చేసేవారు. ఈ నేపథ్యంలో ఆయనపై పలువురు పాకిస్థాన్ అభిమానులు విమర్శలు కూడా చేసేవారు. ఐపీఎల్ లో ధోనీ ఆటను చూసేందుకు వెళ్లాలని ఉందని... అయితే, ప్రయాణాలపై నిబంధనలు ఉన్నాయని బషీర్ తెలిపారు. దీనికి తోడు తన ఆరోగ్యం కూడా సరిగా లేదని అన్నారు. పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చిన తర్వాత... రాంచీలోని ధోనీ ఇంటికి వెళ్లి ఆయనను కలుస్తానని చెప్పారు.


More Telugu News