ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఏంటో విడమర్చిన జనసేనాని!

  • వినాయక చవితి నుంచి ఆత్మ నిర్భర్ భారత్ పై ప్రచారం
  • బీజేపీతో కలిసి ప్రజల్లోకి తీసుకెళతామన్న పవన్
  • మన ఉత్పత్తులు, మన అభివృద్ధి అంటూ ప్రకటన
కొన్నాళ్ల కిందట బీజేపీతో జట్టు కట్టిన జనసేనాని పవన్ కల్యాణ్ ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యాచరణను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. వినాయకచవితి నుంచి బీజేపీ-జనసేన సంయుక్తంగా ఆత్మ నిర్భర్ భారత్ పై ప్రచారం సాగిస్తాయని పవన్ వెల్లడించారు. మోదీ రూపొందించిన ఆత్మ నిర్భర్ భారత్ ఆలోచన ముఖ్య ఉద్దేశం ఏమిటో పవన్ వివరించారు. మన దేశీయ ఉత్పత్తులను వాడడం, మన దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా మన ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే మన ఉత్పిత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి అని వివరించారు.

ఇప్పుడు తమ ముందున్న కర్తవ్యం... ఈ కార్యాచరణలో ప్రజలను కూడా భాగస్వాములను చేయడమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వినాయకచవితి నుంచే శ్రీకారం చుడుతున్నామని, మనదేశంలో ఏ పని చేయడానికైనా ముందు విఘ్నాలు తొలగించాలంటూ వినాయకుడికి పూజలు చేస్తామని, అందుకే వినాయక చవితి నుంచే ఈ పని మొదలుపెడుతున్నామని వివరించారు.

మన పండుగలు, ఆచార సంప్రదాయాల్లో సైతం మనకు తెలియకుండానే విదేశీ వస్తువులు చేరిపోతున్నాయని, ఆఖరికి దేవతామూర్తుల విగ్రహాలు కూడా విదేశాల్లోనూ తయారవుతున్నాయని పవన్ వెల్లడించారు. తద్వారా మనకు తెలియకుండానే ఆ దేశ అభివృద్ధికి దోహదపడుతున్నామని వివరించారు. ఇకపై మనం ఏది కొన్నా అది స్వదేశీ ఉత్పత్తా లేక విదేశీ ఉత్పత్తా అనేది చూడాలని, అందుకు ఈ వినాయక చవితి నుంచే నాంది పలుకుదామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ తీసుకువచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క వర్గానికో చెందినది కాదని స్పష్టం చేశారు. మన దేశీయ వస్తువులు కొంటే మన దేశ ఉత్పత్తిదారులకు ఉపయోగపడుతుందని తెలిపారు.


More Telugu News