సుశాంత్ మృతి కేసు.. ఫిల్మ్ మేకర్ సందీప్ ఎస్ సింగ్‌పై బోలెడు అనుమానాలు!

  • సుశాంత్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని మీడియా ఎదుట చెప్పిన సందీప్ 
  • గత 12 నెలలుగా సుశాంత్‌కు ఒక్క ఫోన్ కూడా చేయని వైనం
  • సుశాంత్ మృతి తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి
బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసులో తాజాగా మరో కీలక విషయం వెలుగు చూసింది. సుశాంత్‌కు తాను క్లోజ్ ఫ్రెండ్‌నని మీడియా ఎదుట చెప్పిన ఫిల్మ్ మేకర్ సందీప్ ఎస్ సింగ్ గత ఏడాది కాలంగా సుశాంత్‌కు ఫోన్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సుశాంత్ మృతి తర్వాత సందీప్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.

సుశాంత్ మరణించిన రోజు ఆయన ఇంట్లో పోలీసులకు సూచనలు ఇవ్వడం, సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగిన కూపర్ ఆసుపత్రికి వెళ్లి అక్కడి వ్యవహారాలు చూసుకోవడం, అంత్యక్రియల్లో కీలకంగా వ్యవహరించడంతో సందీప్ ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. అంత్యక్రియల అనంతరం అతడు మాట్లాడుతూ సుశాంత్ తనకు చాలా దగ్గరి స్నేహితుడని చెప్పాడు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సుశాంత్‌కు తాను క్లోజ్ ఫ్రెండ్‌నని చెప్పే సందీప్ గురించి సుశాంత్ తల్లిదండ్రులకు కానీ, అతడి సిబ్బందికి కానీ అతడెవరో తెలియకపోవడం.

అయితే, అతడి మాటలకు, చేతలకు పొంతన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సుశాంత్‌కు తాను క్లోజ్‌ఫ్రెండ్‌నని చెప్పుకుంటున్న సందీప్, గత ఏడాది కాలంగా సుశాంత్‌కు ఒక్కటంటే ఒక్క ఫోన్‌కాల్ కూడా చేయకపోవడం అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన కాల్‌డేటాను ఓ జాతీయ పత్రిక సంపాదించింది. ఇందులో గత 12 నెలల్లో సందీప్ నుంచి సుశాంత్‌కు ఒక్క ఫోన్‌ కూడా రాలేదు. కానీ అతడి మరణం తర్వాత ఒక్కసారిగా సుశాంత్ ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యాడు.

సుశాంత్ మృతి తర్వాత ‘వందే భారతం’ సినిమా పోస్టర్‌ను షేర్ చేశాడు. అందులో సుశాంత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడతడి మరణంతో ఆ సినిమాను పూర్తిచేసి సుశాంత్ జ్ఞాపకంగా విడుదల చేయాలని సందీప్ నిర్ణయించాడు. నిజానికి సందీప్ దశాబ్దం క్రితం వరకు సుశాంత్, అతడి ప్రియురాలు అంకిత లోఖండేతో కలిసి ఉండేవాడు.

సుశాంత్ మృతి చెందిన 5 రోజుల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టాడు. అందులో సుశాంత్‌ను అంకిత ఎలా సేవ్ చేసిందీ పేర్కొన్నాడు. వారిద్దరూ వివాహం చేసుకుంటే చూడాలని ఉండేదని అన్నాడు. ఇన్ని చెప్పిన సందీప్ ఎవరో తమకు తెలియదని సుశాంత్ తల్లిదండ్రులు తెలిపారు. సుశాంత్ సిబ్బంది కూడా వారి స్నేహాన్ని ధ్రువీకరించడం లేదు. దీంతో ఇప్పుడు అనుమానాలన్నీ సందీప్ వైపు మళ్లాయి.  

సుశాంత్ మరణం తర్వాత ప్రత్యక్షమైన సందీప్ పోస్టుమార్టం జరిగిన కూపర్ ఆసుపత్రికి ఎందుకు వెళ్లాడన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అతడు మామూలుగానే వెళ్లాడా? లేక, ఎవరైనా అతడిని పంపి ఉంటారా? అన్న ప్రశ్నలు వేధిస్తున్నాయి. మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితాని, వంటమనిషి నీర్‌సింగ్‌లను నిన్న రెండోసారి ప్రశ్నించింది.


More Telugu News