డేటా ఎంట్రీలో తప్పిదం.. కరోనా సోకకున్నా 14 రోజులు ఐసోలేషన్‌లో గడిపిన మహిళ!

  • మూడు గంటల తర్వాత సరిచేసినా అప్పటికే బీబీఎంపీకి చేరిన రిపోర్టులు
  • మరోమారు పరీక్ష చేయించుకునేందుకు వెళ్తే బయటపడిన నిజం
  • ఆమె అనుభవించిన మానసిక క్షోభకు వైద్యుల పశ్చాత్తాపం
బెంగళూరుకు చెందిన ఓ మహిళ తనకు కొవిడ్ సోకకున్నా 14 రోజులపాటు ఐసోలేషన్‌లో గడిపింది. ఆపై నెగటివ్ సర్టిఫికెట్ తెచ్చుకునేందుకు ఆసుపత్రికి వెళ్లగా అసలు విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైంది. డేటా ఎంట్రీలో దొర్లిన తప్పు కారణంగా తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని తెలుసుకుని నివ్వెరపోయింది. దీంతో విషయాన్ని ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

నగరానికి చెందిన మహిళ (28)కి ఈ నెల మొదట్లో జ్వరం రావడంతో భయపడిన ఆమె జయనగర్ జనరల్ ఆసుపత్రికి వెళ్లి కొవిడ్ పరీక్ష చేయించుకుంది. రిపోర్టుల్లో ఆమెకు పాజిటివ్ వచ్చిందని చెబుతూ ఆ తర్వాతి రోజు బృహత్ బెంగళూరు మహానగర్ పాలికె (బీబీఎంపీ) అధికారులు ఫోన్ చేసి చెప్పారు. 14 రోజుల పాటు ఆసుపత్రిలో కానీ, ఇంటిలో కానీ ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పడంతో హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు ఆమె అంగీకరించింది.  

ఈ నెల 16తో ఆమె ఐసోలేషన్‌ గడువు ముగియడంతో మరోమారు టెస్టు చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె పాత రికార్డును పరిశీలించిన అధికారులు షాకయ్యారు. ఆమెకు వైరస్ సోకలేదని, డేటా ఎంట్రీ కారణంగా పొరపాటున పాజిటివ్ అని రికార్డయిందని చెప్పడంతో మహిళ నివ్వెరపోయింది. నిజానికి ఆ తప్పును మూడు గంటల తర్వాతే గుర్తించి సరిచేశామని, అయితే, అప్పటికే ఆ రిపోర్టులు బీబీఎంపీకి చేరిపోయాయని చెప్పారు.

తనకు కరోనా సోకిన విషయం తెలిసి ఈ 14 రోజులు ఆమె ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుందో తమకు తెలుసంటూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) న్యూరోవైరాలజీ విభాగం హెడ్ డాక్టర్ రవి విచారం వ్యక్తం చేశారు.


More Telugu News