భారత న్యాయ వ్యవస్థపై గౌరవంతో జరిమానా కడుతున్నా: సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్

  • న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జరిమానా
  • జరిమానా కట్టి, రివ్యూ పిటిషన్ వేస్తా
  • తన అభిప్రాయాలను మార్చుకోబోనన్న ప్రశాంత్ భూషణ్
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మేరకు తాను జరిమానాగా ఒక్క రూపాయిని కట్టాలని నిర్ణయించుకున్నానని సీనియర్ న్యాయవాది, కోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో దోషిగా నిరూపితమైన ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. తనకు భారత న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులపై ఎంతో గౌరవం ఉందని వ్యాఖ్యానించిన ఆయన, న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ప్రకారం, తాను ఒక్క రూపాయిని కోర్టుకు జమ చేస్తానని అన్నారు.

ఇదే సమయంలో కోర్టు ఇచ్చిన తీర్పుపై తాను రివ్యూ పిటిషన్ ను కూడా దాఖలు చేస్తానని ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. "నేను రివ్యూ పిటిషన్ ను దాఖలు చేసే హక్కును కలిగివున్నాను. దాన్ని దాఖలు చేస్తాను కూడా. అయితే, అంతకన్నా ముందే కోర్టు ఆదేశించినట్టుగా జరిమానా కడతాను" అని తన ట్విట్టర్ ఖాతాలో ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు.

కాగా, గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులు సరిగా లేవంటూ భూషణ్ చేసిన వివాదాస్పద ట్వీట్లపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం తొలుత ఆయన తన మనసు మార్చుకునేందుకు అవకాశాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, అందుకో హద్దు ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

అయితే, తన అభిప్రాయాలను మార్చుకునేది లేదని, తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని కోర్టు ముందు ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేయడంతో, కోర్టు ధిక్కరణ నేరంగా దీన్ని పరిగణనలోకి తీసుకుని, సోమవారం నాడు తీర్పిచ్చిన సుప్రీంకోర్టు, ఒక రూపాయి జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్షతో పాటు మూడేళ్ల ప్రాక్టీస్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.


More Telugu News