మరో మూడు రోజుల్లో అన్ లాక్ 5.0... సడలింపులు ఇవే!

  • అక్టోబర్ 1 నుంచి అన్ లాక్ 5.0
  • దేశంలో ప్రారంభంకానున్న దసరా - దీపావళి సీజన్
  • సినిమా హాల్స్, టూరిజం తిరిగి ప్రారంభమయ్యే అవకాశం
  • నేడో, రేపో నూతన విధివిధానాలు, మరిన్ని సడలింపులు
భారతావని అన్ లాక్ 4.0ను సెప్టెంబర్ 30తో ముగించుకుని, అక్టోబర్ 1 నుంచి అన్ లాక్ 5.0లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ ఐదో విడత అన్ లాక్ పై మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించలేదు. అయితే, గతంతో పోలిస్తే మరిన్ని సడలింపులు ఉంటాయని కేంద్ర వర్గాలు అంటున్నాయి.

ఇటీవలి వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రో-కంటెయిన్ మెంట్ జోన్ల ఏర్పాటు ఆలోచనను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్వల్ప కాల వ్యవధి లాక్ డౌన్ లు, కర్ఫ్యూలను విధించాలని కూడా ఆయన సీఎంలకు సూచించారు.

కాగా, ఇండియాలో దసరా - దీపావళి పండగ సీజన్ మొదలు కానుంది. ఆపై వెంటనే క్రిస్మస్ వేడుకలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మరిన్ని నిబంధనలను సడలించడం ద్వారా, ప్రజల యాక్టివిటీని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం ఇవ్వవచ్చని ప్రభుత్వం భావిస్తూ, అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అన్ లాక్ 5.0లో భాగంగా సినిమా హాల్స్ తిరిగి తెరచుకోవచ్చన్న నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బార్లు, క్లబ్బులు తెరచుకున్నాయి. పరిమితంగానే అయినా, ప్రజల అవసరాలను తీర్చేలా బస్సులు కూడా నడుస్తున్నాయి. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు కూడా మొదలై పోయాయి. అక్టోబర్ 1 నుంచి సినిమా హాల్స్ తెరచుకోవచ్చని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతిచ్చింది.

కేంద్ర హోమ్ శాఖకు సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖారే ఓ లేఖ రాస్తూ, నిబంధనలకు అనుగుణంగా సినిమా హాల్స్ తెరిచేందుకు అనుమతించాలని గతంలోనే లేఖ రాశారు. లైన్ వదిలి లైన్ లో సీట్లను ఖాళీగా ఉంచుతూ, 50 శాతం కన్నా తక్కువ ప్రేక్షకులతో సినిమాలను ప్రదర్శించుకునేందుకు అన్ లాక్ 5.0లో అనుమతి లభించనుందని సమాచారం. ఇక కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన మరో రంగమైన టూరిజం సెక్టార్ కు కూడా సడలింపులు భారీగానే లభించనున్నాయి. పర్యాటకులకు స్వాగతం పలికేలా అన్ని టూరిజం స్పాట్లూ తెరచుకోనున్నాయి.

ఇప్పటికే ఉత్తరాఖండ్ టూరిస్టులను స్వాగతిస్తోంది. ఎలాంటి కరోనా రిపోర్టు, క్వారంటైన్ లేకుండానే తమ రాష్ట్రానికి పర్యాటకులు వచ్చిపోవచ్చని కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఇక అక్టోబర్ నుంచి విద్యా సంస్థలకు కూడా మరిన్ని సడలింపులు ఉంటాయని, ఈ విషయంలో మాత్రం నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని కూడా కేంద్రం స్పష్టం చేస్తుందని సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 9 నుంచి 12 తరగతులకు క్లాసులు ప్రారంభమైన సంగ తి తెలిసిందే. ప్రైమరీ స్కూళ్లు మాత్రం మరికొన్ని వారాల తరువాతే తిరిగి తెరిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.


More Telugu News