విజయ్ సేతుపతి హీరోగా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. త్వరలో ఫస్ట్ లుక్!

  • క్రికెటర్ల బయోపిక్ లకు విశేష ఆదరణ 
  • మురళీధరన్ బయోపిక్ గా '800'
  • మెళకువలు నేర్చుకున్న విజయ్ సేతుపతి
  • ఈ 13న ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల  
మనదేశంలో క్రీడల్లో క్రికెట్ కు వున్న క్రేజ్ అంతాఇంతా కాదు. కొందరు క్రికెటర్లకు సినీ తారలకన్నా ఎక్కువ పాప్యులారిటీ ఉంటుందనడంలో అతిశయోక్తి కూడా లేదు. అందుకే, సెలబ్రిటీ క్రికెటర్ల జీవితకథలతో నిర్మించిన బయోపిక్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ స్పిన్ బౌలర్, శ్రీలంకకు చెందిన తమిళుడు అయినా ముత్తయ్య మురళీధరన్ పై కూడా ఇప్పుడు ఓ బయోపిక్ రూపొందుతోంది.

ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇందులో మురళీధరన్ గా టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఇందుకోసం ఆయన క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. అందులో భాగంగా మురళీధరన్ వద్ద స్పిన్ మెళకువలను కూడా తెలుసుకున్నాడు. ఈ చిత్రానికి '800' అనే గమ్మత్తయిన టైటిల్ని నిర్ణయించారు. మురళీధరన్ టెస్టు క్రికెట్లో 800 వికెట్లు తీసి రికార్డు సృష్టించిన వైనానికి సంకేతంగా ఈ టైటిల్ని నిర్ణయించారు.

 ఇక, ఇటీవలి లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన ఈ చిత్రం షూటింగును త్వరలో మొదలుపెడుతున్నారు. ఈ లోగా ఈ నెల 13న ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీపతి దర్శకత్వం వహిస్తున్న ఈ '800' చిత్రంలో మలయాళ నటి రజిశ విజయన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్ కి చేరుకోక మునుపు పడ్డ కష్టాలను, అప్పటి సంఘటనలను ముఖ్యంగా చూపిస్తారట.    


More Telugu News