ధరణి ఓ ప్రైవేటు యాప్... అందులో ప్రజల వివరాలు నమోదు చేయడమేంటి?: జగ్గారెడ్డి

  • టీఆర్ఎస్ సర్కారుపై జగ్గారెడ్డి ఆగ్రహం
  • సీఎం, మంత్రుల ఆస్తులు కూడా ధరణిలో నమోదు చేయాలన్న జగ్గారెడ్డి
  • అప్పుల వివరాలు ఎందుకు అడగడంలేదంటూ వ్యాఖ్యలు
కాంగ్రెస్ శాసనసభ్యుడు జగ్గారెడ్డి టీఆర్ఎస్ సర్కారుపై మండిపడ్డారు. ధరణి ఓ ప్రైవేటు యాప్ అని, దాంట్లో ప్రజల ఆస్తుల వివరాలు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఈ వివరాలను తాకట్టుపెట్టి భారీ మొత్తంలో రుణాలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధరణి వ్యవస్థ తెలంగాణ ప్రజలకు అవసరమా అని నిలదీశారు. ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ముందు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆస్తుల వివరాలు కూడా ధరణి పోర్టల్ లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

పేదవాళ్లు ఏళ్ల తరబడి శ్రమించి కూడబెట్టి ఆస్తులు కొనుగోలు చేస్తే వాటికి ఆధారాలు ఎలా చూపించాలో ప్రభుత్వమే సమధానం చెప్పాలని మండిపడ్డారు. అయినా, ఆస్తుల వివరాలు అడుగుతున్న ప్రభుత్వం, అప్పుల వివరాలు ఎందుకు అడగడంలేదని అన్నారు. ప్రైవేటు యాప్ లో ఆస్తులు వివరాలు నమోదు చేస్తుండడంపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయని, ముందు ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ధరణి యాప్ తీసుకువచ్చేముందు ప్రభుత్వం ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.


More Telugu News