వందేళ్లలో ఇలాంటి భయానక పరిస్థితి ఎప్పుడూ లేదు: పవన్ కల్యాణ్

  • భారీ వర్షాలతో రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి
  • ప్రాణ, ఆస్తి నష్టాలు చోటుచేసుకున్నాయి
  • రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు బాధితులను ఆదుకోవాలి
భారీ వర్షాలతో ఇరు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. రోడ్లు నదులను తలపిస్తుంటే, లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా తయారయ్యాయి. రెండు రాష్ట్రాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రైతుల పంట మొత్తం నాశనమైంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవాలని రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా కోరారు.

"తీవ్ర వాయుగుండం కారణంగా భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చోటు చేసుకోవడం దురదృష్టకరం. కరోనా దెబ్బతో తల్లడిల్లిపోతున్న ప్రజలకు వాయుగుండం రూపంలో ప్రకృతి తీరని శోకాన్ని మిగిల్చింది. తెలంగాణాలో 13 మంది, ఆంధ్రప్రదేశ్ లో ఆరుగురు జల విలయం కారణంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. హైదరాబాద్ పాతనగరంలో ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందడం చాలా విషాదకరం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగాన్ని ఈ ప్రకృతి విపత్తు తీవ్రంగా దెబ్బ తీసింది. వరి, మొక్కజొన్న, పత్తి, మిరప వంటి పంటలతో పాటు ఉద్యాన పంటలను సైతం ఈ వర్షాలు విడిచిపెట్టలేదు. లక్షన్నర ఎకరాలలోని పంట నాశనమై రైతులకు సుమారు రూ.400 కోట్ల నష్టం వాటిల్లడం ఎంతో ఆవేదనను కలిగిస్తోంది.

కృష్ణా, గోదావరి నదులతో పాటు రెండు రాష్ట్రాలలో ఏర్లు, వాగులు, చివరకు చెరువులు సైతం ఉగ్రరూపంతో ప్రజలను ముంచెత్తుతున్నాయి. ఇంతటి భారీ వర్షాలు ఈ వందేళ్లలో కురవలేదని రికార్డులు వెల్లడిస్తుంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఆపన్నులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఉన్నచోట తక్షణం పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలి. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, రైతులకు ఉదారంగా నష్టపరిహారాన్ని అందించాలి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఈ ఆపత్కాలంలో జనసైనికులు తమవంతు చేయూతను అందించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.  మరో రెండు రోజులు ఇదే స్థాయిలో వర్షాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగుతున్నాయి.  నాలాలు కూడా ప్రమాదకరంగా మారాయి. ప్రజలెవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాను" అని ఆయన ట్వీట్ చేశారు.


More Telugu News