కరోనాపై ట్రంప్ చేతులెత్తేశారు... నేను గెలిస్తే ఉచిత టీకా: జో బైడెన్

  • అధికారంలోకి వచ్చిన మరుక్షణం కరోనా కట్టడిపై దృష్టి 
  • వ్యాధి బారిన పడిన వారిని ఆదుకుంటా
  • తాజాగా వాషింగ్టన్ లో మాట్లాడిన బైడెన్
కరోనా మహమ్మారిని అంతమొందించే విషయంలో ఓ జాతీయ స్థాయి విధానం అత్యవసరమని, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ పోరులో పూర్తిగా విఫలమై, చేతులెత్తేశారని యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున పోటీ పడుతున్న జో బైడెన్ విమర్శలు గుప్పించారు. తనను గెలిపిస్తే, అధికారంలోకి రాగానే ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకాను అందిస్తామని హామీ ఇచ్చారు.

 తాజాగా వాషింగ్టన్ లో ఆయన మాట్లాడుతూ, ట్రంప్ ను మరోసారి టార్గెట్ చేసుకున్నారు. నిపుణులు సూచించినట్టుగా భౌతిక దూరాన్ని పాటించడం, మాస్క్ లను ధరించడం తప్పనిసరని, తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కరోనా కట్టడిపై దృష్టిని సారిస్తానని, మహమ్మారి సోకి బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు చర్యలు చేపడతానని స్పష్టం చేశారు.

కాగా, కరోనా కేసుల విషయంలో ప్రపంచంలోనే అమెరికా మొదటి స్థానంలో వుంది. ఇప్పటివరకూ సుమారు 86 లక్షల మందికి వ్యాధి సోకగా, 2.27 లక్షల మందికి పైగా మరణించారు. దీంతో వచ్చే వారం జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కరోనా ప్రధానాంశంగా మారింది. అటు ట్రంప్, ఇటు బైడెన్ వ్యాక్సిన్ అంశాన్ని తరచూ ప్రస్తావిస్తూ, ప్రజల మద్దతు పొందాలని చూస్తున్నారు.


More Telugu News