రెవెన్యూ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్న క్షమాపణ చెప్పాలి: ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చీఫ్ బొప్పరాజు డిమాండ్

  • అయ్యన్న వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్న బొప్పరాజు
  • అయ్యన్న తన వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలని స్పష్టీకరణ
  • మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం తగదని హితవు
విశాఖ గీతం సంస్థల ప్రాంగణంలోని ఆక్రమణల తొలగింపులో పాల్గొన్న రెవెన్యూ అధికారులపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. అయ్యన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు బొప్పరాజు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులకు అయ్యన్నపాత్రుడు బేషరతుగా  క్షమాపణ చెప్పాలని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని  డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆ ఉద్యమాన్ని నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద నుంచే మొదలుపెడతామని చెప్పారు.

గతంలో మంత్రిగా పనిచేసి, సీనియర్ రాజకీయవేత్త అయివుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని బొప్పరాజు హితవు పలికారు. ఆక్రమణలకు పాల్పడినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పాల్సిన మీరే, చట్టపరంగా విధి నిర్వహణలో పాల్గొన్న రెవెన్యూ అధికారులపై దుర్భాషలాడడం మంచిపద్ధతికాదని స్పష్టం చేశారు. అధికారులను అభినందించాల్సింది పోయి, ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు.


More Telugu News