పంజాబ్ వరుస విజయాలకు బ్రేక్.. 7 వికెట్ల తేడాతో నెగ్గిన రాజస్థాన్

  • గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా
  • ప్లే ఆఫ్స్ ముందు పంజాబ్ బోల్తా
  • బెన్‌స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
ఐపీఎల్‌లో మొదట్లో తడబడి, ఆ తర్వాత అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు రాజస్థాన్ రాయల్స్ షాకిచ్చింది. 186 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 15 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలపై ఈ ఓటమి గట్టి దెబ్బ కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాహుల్ సేన గేల్ అదిరే ఇన్నింగ్స్‌తో 185 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 186 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

 రాబిన్ ఉతప్ప, బెన్‌స్టోక్స్‌లు జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాక 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసిన స్టోక్స్ పెవిలియన్ చేరాడు. 30 పరుగులు చేసిన ఉతప్ప 111 పరుగుల వద్ద అవుట్ కాగా, సంజు శాంసన్, కెప్టెన్ స్మిత్‌లు కలిసి జట్టును విజయానికి చేరువ చేశారు. ఇద్దరూ అడపాదడపా బంతిని బౌండరీలకు బాదుతూ ఒత్తిడి లేకుండా చూసుకున్నారు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసిన శాంసన్ అవుటయ్యాక వచ్చిన బట్లర్‌తో కలిసి స్మిత్ జట్టుకు విజయాన్ని అందించాడు. స్మిత్ 20 బంతుల్లో 31, బట్లర్ 11 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ తొలి ఓవర్ చివరి బంతికి మన్‌దీప్ (0) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన గేల్‌తో కలిసి జాగ్రత్తగా ఆడిన రాహుల్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. గేల్ క్రీజులో కుదురుకున్నా మరోమారు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఎడాపెడా సిక్సర్లు బాదుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. రాహుల్ (46) అవుటైన తర్వాత కూడా గేల్ తన జోరును కొనసాగించాడు.

63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 99 పరుగులు చేసిన గేల్.. ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో పూరన్ 10 బంతుల్లో మూడు సిక్సర్లతో 22 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 180 పరుగులు దాటింది. మ్యాక్స్‌వెల్ 6, దీపక్ హుడా ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో పంజాబ్ ఇన్నింగ్స్ 185/4 పరుగుల వద్ద ముగిసింది. బెన్‌స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


More Telugu News