భారత ప్రధాని నరేంద్రమోదీపై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ప్రశంసలు
- మోదీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన టెడ్రోస్ అథనోమ్
- భారత్ సంఘీభావానికి కృతజ్ఞతలు
- భారత్‌తో కలిసి ముందుకు సాగుతామని ప్రకటన
కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి, ప్రపంచ అవసరాలను తీర్చగలిగే శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయన్న భారత ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ప్రశంసలు కురిపించారు. మోదీ ప్రకటనకు కృతజ్ఞతలు తెలిపిన అథనోమ్.. కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు కలిసి పనిచేయడానికి మోదీ అంగీకరించారని పేర్కొన్నారు.
ప్రపంచ మానవాళిపై మీరు చూపించిన సంఘీభావానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. జాతి శ్రేయస్సు కోసం పరస్పరం కలిసి పనిచేస్తే కరోనా వైరస్ నుంచి బయటపడొచ్చన్నారు. సంప్రదాయ వైద్యంలో భారత్ సహకారం, జ్ఞానం, పరిశోధన, శిక్షణలను బలోపేతం చేయాలనే దానిపై భారత్ పాత్రను ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతిస్తోందని టెడ్రోస్ పేర్కొన్నారు.
75వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తి చేసే దేశంగా తాను ఈ రోజు ప్రపంచానికి హామీ ఇవ్వాలనుకుంటున్నానని మోదీ అన్నారు. కొవిడ్‌పై పోరాడడానికి ప్రపంచ దేశాలకు భారత్ సహాయపడుతుందని మోదీ పేర్కొన్నారు.