వచ్చే నెలలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ టీకాకు అనుమతులు.. 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధం!

  • ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న సీరమ్
  • ప్రపంచవ్యాప్తంగా వాక్సినేషన్ పూర్తయ్యేందుకు 2024 వరకు పట్టే అవకాశం
  • ఆ తర్వాత రెండేళ్లకు కానీ వైరస్ నియంత్రణపై రాని స్పష్టత
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి వచ్చే నెలలో అనుమతులు లభించే అవకాశం ఉండడంతో, 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేయాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ నిర్ణయించింది. దేశీయంగా ఈ టీకాను ఉత్పత్తి చేస్తున్న సీరమ్.. టీకా ఉత్పత్తిని వేగవంతం చేసింది.

ఈ సంస్థ సీఈవో ఆదార్ పూనావాలా మాట్లాడుతూ.. ఈ టీకాకు వచ్చే నెలలో అనుమతులు లభించే అవకాశం ఉందన్నారు. డిసెంబరులో టీకాను పంపిణీ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్టు చెప్పారు. వ్యాక్సిన్ వినియోగానికి వచ్చే ఏడాది పూర్తిస్థాయి అనుమతులు కనుక లభిస్తే 50:50 శాతం నిష్పత్తితో దక్షిణాసియా దేశాలకు, పేద దేశాలకు సరఫరా చేస్తారు. టీకా పంపిణీ వ్యవహారాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చూసుకుంటుంది.

కొవిడ్ టీకాను అభివృద్ధి చేస్తున్న ఐదు సంస్థలతో టీకా ఉత్పత్తికి సంబంధించి భాగస్వామ్యం కుదుర్చుకున్న సీరమ్ ఇనిస్టిట్యూట్.. ఆస్ట్రాజెనెకా టీకాను గత రెండు నెలల్లో 4 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేసింది. త్వరలోనే నోవావ్యాక్స్ టీకా ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ రెండు టీకాలు కరోనా వైరస్‌ను సమర్థంగా కట్టడి చేస్తాయని భావిస్తున్నట్టు పూనావాలా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తికావాలంటే 2024 వరకు సమయం పడుతుందని పూనావాలా అంచనా వేశారు. వైరస్ ఎంతవరకు నియంత్రణలోకి వచ్చిందనే విషయంలో ఆ తర్వాత రెండేళ్లకు గానీ స్పష్టత వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు.


More Telugu News