స్వరూపానందకు ఆలయ మర్యాదలు.. హైకోర్టు హెచ్చరికతో వెనక్కి తగ్గిన శారదాపీఠం!

  • 23 ఆలయాల నుంచి మర్యాదలు చేయాలని ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
  • సన్యాసికి మర్యాదలు, కానుకలు అవసరమా? అన్న హైకోర్టు
  • మెమోను సస్పెండ్ చేస్తామన్న హైకోర్టు
ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ 23 ఆలయాల నుంచి ఆయనకు మర్యాదలు, కానుకలను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన మెమోపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మెమోను సస్పెండ్ చేస్తామని తెలిపింది. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ కల్పించుకుని... 2018, 2014 అంటూ ఏదో చెప్పబోగా... ఆయన వాదనను వినేందుకు హైకోర్టు ఆసక్తి చూపలేదు. గతంలో జరిగిన విషయాలు ఇప్పుడు అనవసరమని... ఇప్పుడు ఏమిటనే దానిపై మాట్లాడదామని తెలిపింది.

సన్యాసిగా ఉండే వ్యక్తికి కానుకలు, మర్యాదలు అవసరమా? అని హైకోర్టు ప్రశ్నించింది. హైందవ ధర్మాన్ని మీరు అర్థం చేసుకున్నట్టు లేరని వ్యాఖ్యానించింది. మెమోను సస్పెండ్ చేస్తున్నామని తెలిపింది. ఈ సందర్భంగా శారదాపీఠం తరపు లాయర్ మాట్లాడుతూ... మెమోను సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆలయ మర్యాదలను కల్పించాలంటూ ప్రభుత్వానికి తాము రాసిన లేఖను వెనక్కి తీసుకుంటున్నామని కోర్టుకు తెలిపారు. అనంతరం మెమోను సస్పెండ్ చేస్తున్నట్టు హైకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో, ఈ వ్యవహారం అక్కడితో ముగిసింది.  


More Telugu News